పుట:Konangi by Adavi Bapiraju.pdf/111

ఈ పుట ఆమోదించబడ్డది

“ఏది దారని ఎవరినడిగెద

ఏది నిజమని ఏల వెదికెదవో?

ఆలసించిన అమృతమేనా

కాలకూటముగాక, మారుని

వేళదాటిన వేడుకేలా

వెక్కిరింతేగా?

బ్రతుకు యాత్రలో విధము తెలియక

బాటకాదిది బాట అది అని

మనసు తెలియని మనుజు డెవడో

వాడు నాశనమే!”

అని పాడుకొంటూ కుర్చీలో కూలబడినాడు. ఆ పాటా, ఆ పాట పాడిన గంభీర మధుర కంఠమూ ఆ సెట్టులో ఉన్నవారందరి గుండెలూ నలిపివేశాయి,

నాయకుని పాట వింటూ, అతని తల్లి గదిలోనికి వచ్చి “నాన్నా! ఏమి చేయదలచుకొన్నావు?” అని అడిగినట్లు ఒక రంగంలో అభినయం ప్రారంభం.

నాయకుడు: ఏం చేయమంటావు? నువ్వు అంతా చూస్తున్నావు. నీ సలహా ఏమిటి?

తల్లి: ఒరే నాన్నా! ఒక్క కొడుకువు! ముగ్గురు ఆడపిల్లల తర్వాత పుట్టావు నీ మీద మీ. నాన్నగారికి ప్రేమలేదంటావా?

నాయ: ఇక్కడ నాన్నకు ప్రేమలేదన్నమాట ఏమి వచ్చిందమ్మా? ప్రేమ వేరు. ఒక పురుషుని జీవితమార్గం ఏర్పరచుకోవడం వేరు.

తల్లి: ఏమి టా జీవితమార్గం?

నాయ: రాక్షసులుచేసే ఉద్యోగాలు చేయడమా అది? బానిస అవడమా దారి? ఎందుకమ్మా నాకా డిప్యూటీ కలెక్టరు పదవి. నాన్న స్నేహాలవల్లా, నేరుపువల్లా ఆ ఉద్యోగం ఎం.ఏ. ప్యాసయిన రెండో సంవత్సరమైన ఈ ఏడే నాకు తెప్పించిపెట్టారు.

తల్లి: నాన్న తెప్పించడమేమిటి? నువ్వే ఆ పదవికి పెట్టిన పరీక్షలో మొదటగా వచ్చావుటగా?

నాయ: నిజం విను, అమ్మా! నేను ఆ పరీక్షలో బాగా కృతార్థుడనయ్యే ఉంటాను. కాని మొదటివాడుగా రావడానికి కారణం నాన్నగారే! ఆయనకూ ఆ పరీక్షకు ఒక ముఖ్యమైన జవాబు పత్రం దిద్దిన ఒక పెద్ద కలెక్టరుగారికి యెంతో స్నేహం. ఒకరివల్ల ఒక రెంతకాలం నుంచో ఉపకారాలు పొందారు. ఆయన నాకు ప్రథమ స్థానం యిప్పించారు.

తల్లి: మీ తండ్రి ఇంత ఆస్థి సంపాదించారురా? రెండు మూడు జమీగ్రామాలు కొని జమీందారనిపించుకున్నారు. ఈ ధనానికి తగిన తాహతు, ఉద్యోగము నీకు ఉండాలనీ, నువ్వు డిప్యూటీ కలెక్టరు, కలెక్టరు పనీ చేస్తూ ఉంటే చూచి ఆనందించాలనీ వారి కోరికరా నాన్నా.

నాయ: అవునమ్మా అవును. నా సోదరులను ఖైదుకు పంపే కలెక్టరు, మాట్లాడడానికి వీలులేదని 144 అస్త్రం ప్రయోగించే యోధుడు, నా దేశాన్ని సర్వకాలం శృంఖలాలలో ఉంచే ప్రభుత్వానికి ఉత్తమాయుధములా అయిన ఆ ఉద్యోగం చేయమంటావు. అంతేనేకాని, నాకు వ్యవసాయం అంటే ఇష్టం. అందులో అనేకరీతులు ప్రవేశింపచేసి నా కృషిఫలితం నే ననుభవిస్తానంటే నాన్నకూ నీకూ గిట్టదు.