ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అభ్యాసయోగలక్షణము

శ్లో.

అఖేటకే శిల్పవిధౌ చ నృత్యేప్యభ్యాసయోగాదుపచీయతేయా।
వీణాస్వనా ద్వైర్విషయైర్బుధాస్తామాభాసికీం ప్రీతి ముదహరన్తి॥


క.

వేఁటల శిల్పక్రీడలఁ
దోఁటల వీణాస్వనాదితూర్యంబులచే
మాటలఁ జదువులఁ గూర్ములు
నాటిన నభ్యాసయోగ నామం బయ్యెన్.


తా.

వేటలాడుటవలనను చిత్తరువుల వ్రాయుటవలనను వనవిహారముచేతను
వీణాదివాద్యవిశేషములచేతను మాటలమూలమునను, చదువులమూలమునను పుట్టిన
ప్రేమ అభ్యాసయోగమని తెలియదగినది.

అభిమానజ సంప్రత్య వైషయికంబుల విషయంబులు

శ్లో.

నాభ్యాసతో నో విషయాద్భవేద్యా సంకల్పమాత్రాదభి మానజా సా।
క్లీబస్య నార్యాశ్చ యథోపదిష్టైః స్త్రీపుంసయోః శ్లేషణ చుంబనాద్యేః॥


శ్లో.

సాదృశ్యతే౽న్యస్య భవేత్క్వచిద్యా తాం ప్రత్యయోత్థాం కథయన్తి ధీరాః।
ఉత్పద్యతే యా విషయైః ప్రధానైః ప్రీతం తు తాం వైషయికీం వదన్తి॥


క.

మానవికారంబున నభి
మానజమగు కూర్మి యొప్పు మసలక మఱియున్
మానినులకు నాలింగన
పానాధరచుంబనాది భావస్థితులన్.


తా.

ఆలింగనము అధరపానము చుంబనము మొదలగు వికారభావస్థితులచే
జనించినప్రీతి యభిమానజమని యెఱుంగదగును.


గీ.

వయసు గుణమును రూపంబు వల్లభులకుఁ
గాంతలకు నొక్కచందమై కానఁబడినఁ
బ్రభవ మొందినఁ గూర్మి సంప్రత్యయోగ
మనుచు నార్యులు చెప్పుదు రభిమతముగ.