పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/90

ఈ పుట ఆమోదించబడ్డది

84

కవికోకిల గ్రంథావళి


పఁజాలని భక్తుఁడును వేదనఁ బొందుచుండును. ఇట్టి పారవశ్యము సాధారణముగ నందఱిభక్తులకుఁ గలుగునది గాదు. ఇది భవముయొక్క పరపారము నంటు కడపటియవస్థ, పన్నిద్దరాళ్వారులలో నమ్మాళ్వారులకే యాదశ కలిగెను. చైతన్యుఁడును నట్టియవస్థ ననుభవించెను. రామకృష్ణ పరమహంసయు నట్టి విశ్లేష వేదన నొందెనని వివేకానందస్వామి నుడివియున్నారు. నమ్మాళ్వారులు రచించిన "తిరువాయి మొజ్షి " అంతయుఁ గొంచె మించుమించుగ విరహిణీగీతము లని చెప్పవచ్చును. మీరాబాయియు, మహారాష్ట్ర దేశపు భక్తులును అట్టి కీర్తనలను రచియించిరి.

తెలుఁగు దేశమున మఱియొక విధమైన యాథ్యాత్మిక కవిత్వము ప్రచారములోనికి వచ్చినది. పోతులూరి వీరబ్రహ్మము, అతని శిష్యుఁడగు సిద్ధయ్య, వేమన్న మొదలగు తత్త్వజ్ఞాను లీ సంప్రదాయమున ముఖ్యులు. బ్రహ్మంగారి కాలజ్ఞాన కీర్తనలను వేదాంత కీర్తనలను తరుణాయి దాసరులు పాడుచుండగ మనము చాలమాఱులు వినియుందుము. భక్తిగీతములందువ లె వానియం దంతరసము చిప్పిల్లుటకు వీలులేదు. అయినను అవి నీరసములుగ నుండవు. ఇచ్చట నొకటి రెండు ఉదాహరణములు అప్రస్తుతములు గావని తలంచెదను.

1. తెలుసుకొండి యన్నలార, తేట తెరువు బట్టాబయలు
   నట్టనడుమా పుట్టాలో గురునాథూ డున్నాడు,
   మూడుచుట్లా కోటలోన ముప్పయిముగ్గూ రున్నారన్నా
   ధ్యానాము కోటాకు ఎక్కూ పెడితే తలుపూలు దీసేమన్నారు.