పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/55

ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

49


ప్రత్యేకముగ వర్ణించును. శరీర వర్ణనము వివరముగఁ బూర్తియగువఱకు నిరువది ముప్పది పద్యములు పట్టును. ఆ పద్యములన్నిటియందు నిమిడియున్న అవయవ వర్ణనమంతయు నొక్క చోటికిచేర్చి యొక యాకారముగ నిర్మించి సమష్టి సౌందర్యమును గ్రహించుట యసాధ్యమైన యుద్యోగము. అంగములను విడివిడిగా కత్తిరించి వేఱుపఱచి వాని యంద చందముల మనము కనుగొనఁజాలము. కావున, కవి యెల్లప్పుడును సమష్టివర్ణనముచేయుట యుపయోగకరము. చిత్రకారుఁడు ఆనందకార్యమును చిత్రింపక తత్కారణభూతమగు రూపమును ప్రత్యక్షము చేయును. కవి కారణమును వర్ణింపక కావ్యమును ( కారణమైన రూపమును జూచుట వలనఁ గలుగు ఆనందమును) వర్ణించును. అట్లయిన అవయవ వర్ణనము కవికి నవసరము లేదా ? కొంతవఱకు అవసరము గలదు. అటువంటి వర్ణనములు సమష్టి వర్ణనమును సార్థక పఱచు నట్లుండిన నదియొక విశేషము,

ఆలరుం దండలఁ దమ్మి దుద్దులను గ్రీవాలంకృతుల్ చేసి కా
మలతోఁ దెచ్చిన కల్వలం జెవులఁ గ్రమ్మన్మాటి, వాసంత పు
ష్ప లతారమ్యతఁ గేరుచున్ నయన నిర్వాణమ్ముఁ గావించు నా
కలకంఠింగని గౌతముం డెదను జిక్కేంబట్టు యత్నంబునన్.
గోరంటాకురసానఁ బాణితలముల్ గోళుల్ పదాబ్జంబులున్
సారాశోక కిసాల రోచి రుదయ స్థానమ్ములై రక్తిమల్
వాఱం, గాఁటుక చీఁకటిం గనులక్రేవంజేర మోహంబు శో
భారాజ్యంబును నేలు రాణియయి దైవాఱుం గురంగాక్షియున్.

(కడపటి వీడుకోలు)