పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/51

ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

45


మోటు నగలుగఁ దోఁపవచ్చును. అట్లయిన, సౌందర్యము వస్తుగతమా లేక మనోగతమా? ఈ విషయమై తుద ముట్టని చర్చలు జరిగియున్నవి. జగన్మిధ్యావాదులు (Idealists) సౌందర్యము మనోగతమనియు, జగత్సత్యవాదులు (realists) సౌందర్యము వస్తుగతమనియుఁ దీర్మానించియున్నారు. కాని, యిరువురి పాదములందును సగము సగము సత్యము గలదు. రూపమునందు సౌందర్యభావము రేఁపు శ క్తిలేని యెడల భావజ్ఞత యుండియు నిరుపయోగము. అట్టి భావము ప్రేరించు శక్తి రూపమునందుండియు దానిని దెలిసికొనఁగల యనుభవజ్ఞానము బుద్ధికి లేనియెడల రూపగత సౌందర్యమును నిరుపయోగము. అనఁగా అటువంటి మందబుద్ధికి రూపమునందు సౌందర్యము లేనట్లె తోఁచును. ఇంద్రియ వ్యాపార మందఱికి నొకే విధముగ జరుగుచుండును; కాని తత్సం దేశములను జక్కఁగ నర్థము చేసికొనుటపై జ్ఞాన మాధార పడియున్నది. కావుననే యాలంకారికులు సహృదయుల హృదయములందుమాత్రమె కావ్యము రసముపుట్టింపఁ గలదని పలుమాఱు నొక్కి చెప్పియున్నారు. 'భావ స్ఫోరక శక్తి బుద్ధి యందును గలదు. కావున రెండును ముఖ్యములె.

రామణీయక మనునది యేక వస్తువుగాదు. అది సమష్టి భావము. రోజాపువ్వు రమ్యముగ నున్నదనుటలో, దాని యాకారము, రంగు, పరిమళము మున్నగునవి చేరియున్నవి. సౌందర్యమును గ్రహింపవలయునన్న సింహావలోకము చేయవలయును. అనఁగా సమష్టి దృష్టితోఁ జూడవలయును.