పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/262

ఈ పుట ఆమోదించబడ్డది

256

కవికోకిల గ్రంథావళి


నుత్తముఁడు. వేఁటకుగాఁ దపోవనమునకుఁబోయి, బ్రాహ్మణ ఋషియైన కణ్వుని యాశ్రమమున అపూర్వ లావణ్యవతిని శకుంతలను జూచి కామప్రేరితుఁడై తండ్రి యనుమతిలేక ఆమెను (అంతః పురము దేవేరులచే నిండియున్నను) గాంధర్వవిధిఁ బరిణయమాడి గర్భవతినిఁ జేసి, ఆర్యమైన మనసు ఉచితమైన దానినే కోరినదని తన తప్పును దుడిచివేసికొని, ధర్మప్రకారము పట్టమహిషి, కుమారునకే రాజ్వము చెందవలసి యుండఁగా, మోహాంధీకృత చిత్తుఁడయి శకుంతల కుమారునకే రాజ్యము నొసఁగునట్లు వాగ్దానముచేసి, పరారియైన దుష్యంతుఁడు విషయలోలుఁడు కాకుండుటెట్లు ? ఏకపత్నీ వ్రతుఁడయి, విరాగిణియైన తన భార్యను ఏయుపాయము చేతనైనను దనవంకకుఁ ద్రిప్పుకొని పూర్వమువలె గార్హస్థ్య జీవితము గడుపుకొన ప్రయత్నించిన రాణా విషయలోలుఁ డగుటెట్లు ! రాణా పరస్త్రీ, పరాఙ్ముఖుఁ డైనందుననేగదా మీరాకొఱకంత పాటుపడెను. గృహస్థులకుఁ దమ భార్యలతో సంసారము చేయవలయునను కోర్కె విషయలోలత్వ మైన యెడల ఇఁక గార్హస్థ్యము గతి యేమి యగును ?

రాణా మొండికట్టెయా? కాఁడు; తనకు యథార్థమని తోఁచినదానిని నిర్వహించుకొను పట్టుదలయు సంకల్ప శక్తియుఁగల తేజశ్శాలి.

రాణా జాల్ముఁడా? జాల్ముఁడనుటకు మూడర్థములు గలవు: యోచించి పనిచేయ లేనివాఁడు, క్రూరుఁడు, అజ్ఞుఁడు. ఆజ్ఞత యేదో యొక విషయమునందు; అది తాత్కాలికము. క్రూరత్వము కడపటి దశయందు వచ్చును; అదియుఁ దాత్కా