పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/236

ఈ పుట ఆమోదించబడ్డది

230

కవికోకిల గ్రంథావళి


ఆనాడును మార్గకవితా దేశికవితా వాదములు పుట్టియుండినవి. దీనికి కారకులు శివకవులు. జాను తెనుగున కావ్య గతార్థము సామాన్యజనులకు బోధపడునట్లు వ్రాయుటయే వారి యుద్దేశము. అట్టి గ్రంథములే మత ప్రచారమున కనుకూలముగ నుండును. ఇట్టి యుద్దేశముగల కవులలో ప్రబంధ పద్ధతిని వ్రాసి ప్రబంధ రచనకు మార్గదర్శియైనవాడు నన్నె చోడుడను రాజకవి. నిర్వచనోత్తర రామాయణమున తిక్కన చేసికొన్న నియమములనుబట్టిన్నీ తర్వాత కొంత కాలమునకు భారతమును రచించిన విధానమునుబట్టిన్నీ ఈయనకూడ జాను తెనుగు ఉద్యమమునకు సంబంధించిన వాడేనని చెప్పవచ్చును సంస్కృతశబ్ద బహుళమైన దీర్ఘ సమాసములకంటె “అలతి యలంతి తునియలుగ” విరుగు తెనుగు శబ్దములపైననే యీయనకు అభిమానము మెండు. ‘‘జాత్యముగామి నొ'ప్పయిన సంస్కృత మెయ్యెడజొన్ప”డు. శివకవులవలెనే తిక్కనకూడ యిట్టి నియమములు చేసికొన్నను ఆచరణలో మాత్రము విధి లేక కొంత ప్రతిజ్ఞా భంగము కలిగినది. ఇది కాలపరిస్థితిని బట్టి అనివార్యము కూడ. అదివఱకే సంస్కృతము ఆంధ్రమునందు తిలతండుల న్యాయముగ కలిసిపోయినది. అరబ్బీ భాష మూలమున పారసీభాష మఱింత సంపన్న మైనట్లు సంస్కృత సంబంధము వలన తెనుగు భాషకు పదజాల సమృద్ధి కలిగినది. కాని ఆ కాలమున ఈ జాను తెనుగు ఉద్యమమే లేనట్లయిన తిక్కన కాలము నాటికే తెనుగు పద్యములు ఇనపగుండ్లుగా తయారై యుండెడివి.