పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/14

ఈ పుట ఆమోదించబడ్డది

8

కవికోకిల గ్రంథావళి


ప్రభల నూరేగించుచుండిన రెడ్లకును బరస్పరము కలహము సంభవించి హత్యలుజరిగిన విషయమును గుఱించి, బిచ్చమెత్తు జోగుల జాతివారు "ఔరా! చెన్నప్పారెడ్డి, నీ పేరే బంగార్పాకడ్డి” అను వీర రసోద్రేక పూరితమైన యొక గేయమును రచించి పాడుచుండిరి. ఇట్టివి యెన్ని యేనియుం గలవు. కలుపుఁదీయు కాలమున నిట్టి చిత్రవిచిత్ర గేయములను మనము యధేష్టముగ వినవచ్చును. పల్లెటూరి కాఁపులకీ విషయము చక్కగ బోధపడఁగలదు. మధురమైన గ్రామ్య సాహిత్యముతో వారికెక్కుడు పరిచయము గలదు.

ప్రకృతితత్త్వ జిజ్ఞాసయు, శాస్త్రజ్ఞానమును, విమర్శ శక్తియు, మానవసంఘమునందు హెచ్చుకొలదికవిత్వశ క్తియు దగ్గిపోవుచుండును, ఎన్ని యో ఋక్కులకు కారణభూతములైన యురుములు, మెఱుములు, ఉషస్సులు నేఁడు మనకు సామాన్యములైనవి. వానిని గాంచినప్పుడు మనము ఆశ్చర్యపడుటలేదు. వెఱపొందుటలేదు. ఈకాలమునఁ బిడుగును ఇంద్రునిచేతి శతారధారనుగ మనము తలంచుట లేదు. ఎందు వలన? “వాతావరణమున సంచరించు సహ్యపసవ్య విద్యుత్ప్రవాహములు మేఘముల మూలమున కలసికొన్నప్పుడు భూమిని దాఁకును! అదియే పిడుగు” అని మనము పాఠశాలలోఁ జదివితిమీ. స్త్రీల ముఖములకు చంద్రబింబమును సరిపోల్చి పూర్వకవులు సంతసించుచుండిరి. కాని, నేఁటికవుల హృదయములో నొక మాలిన్యము ప్రవేశించినది. చంద్రబింబమును చూచినంతనే యందలిసౌందర్వముగోచరించుటకు బూర్వమే ఖగోళశాస్త్రములోఁ జదివిన చంద్రవర్ణనము పెను