పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/222

ఈ పుట ఆమోదించబడ్డది

హృదయము]

ప్రియావియోగము

199

దర్పణంబున బింబంబు దనరినటులు,
నీదురూపంబు మదిలోన నిలిచియుండు!
ఇదిగో! నెచ్చెలి, యని చేతు లెదురుచాఁపఁ,
గఠినసత్యంబు నామోముఁగాంచి నవ్వు!
గాజులును మెట్టె లెవరివో ఘల్లుమనఁగఁ,
దెలియకుండనె కన్నులు తిరిగిచూచు;
నంతదారుణ యాధార్థ్య మాత్మమెఱవ,
గుండె జల్లను, నిట్టూర్పు మెండుకొనును.
ఇరువురకుఁ దప్ప నితరుల కెఱుఁగరాని,
మన రహస్యంబు లెవరితో ననుదు నింక?
హృదయ మంజూష నాచేత నిడి యదేల
తాళపుంజెవి నీయొడి దాఁచినావు?

మఱ పెటుగల్లు నీ నగవు మాటలు నీ దరహాస చంద్రికాం
కురములు,వచ్చిరాని మృదుకోపము, చామనచాయరూపమున్,
సరసత, మన్మనోనుసరణత్వము, నిర్భరమైన ప్రేమయున్,
మురిపెపుఁజూపుఁగావ్యములు, ముద్దులపేటికలౌ కపోలముల్.

పరలోకంబున కేఁగువేళఁ బ్రణయవ్యామోహ మొక్కండె నీ
పరమై పోయె నటంచు నుంటిఁ; దెలిసెం బ్రచ్ఛన్నసత్యంబు; నీ
కరముల్ నాహృదయంబుఁ, గోరికల, సౌఖ్యంబున్, భవిష్యన్మనో
హర గార్హస్థ్య సుజీవితం బడుగుబాయన్ లాగి కొంపోయెఁగా