పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/212

ఈ పుట ఆమోదించబడ్డది

ద్యము]

కవిసంశయావస్థ

189

ఇట్టి దాఁగిలిమూఁతల నెంత దనుక
నన్ను వంచింప నెంచెదో చిన్నదాన?
రసపిపాసల నడఁచు నీరమ్యమూర్తి
మెఱుపువలెనైనఁ జూపించి మఱిఁగి పొమ్ము.

జలదపథంబునం దిరుగు చక్కని చుక్కవె యయ్యు నాపయిం
గల ప్రణయంబునం బసిఁడిగద్దియ డిగ్గి పొలానఁ బచ్చ కం
చెలకడఁ గూరుచుంటివి కృషీవలబాలిక యట్లు; గడ్డిపూఁ
దలిరుల కాన్కతోఁ బ్రథమదర్శన ముత్సవమయ్యెఁ దొయ్యలీ.

ఆ దినం బాది యిరువురి యాత్మలందు
వలపుఁదీవియ లల్లె; బూవులును బూచె;
ఫలము లట్టుల సంతానభాగ్య మబ్బె;
నింతకాలాని కేల నీ కిట్టి యలుక?

నీవు రాణివె యౌదువు; నేను బిచ్చ
మెత్తు పిచ్చిబికారినె; యిద్దఱకును
దారతమ్యంబు కొండంత; తరుణి యింత
పోల్చలేనైతి; నిను నమ్మి మోసపోతి.

'కడపటి వీడుకోలె' మన కౌఁగిలియొత్తుల మద్గులాటకుం
గడపటి వీడుకో లగుటకాదు గదా! యదియేమొ నీవు నన్
విడుతువటన్న సంశయము వేమఱు జీవిత వీణయందు కీ
ల్సడలిన తంత్రియట్లు వికలంబుగఁ బల్కు నపస్వరంబులన్.