ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిక్కనసోమయాజి.

81



పై స్వప్న సందర్భములో హరిహరనాథుండు తన నుద్దేశించి యీక్రింది విధంబుగఁ బల్కె నని వ్రాసె. ఎట్లన్నను :-

ఉ. వైదికమార్గనిష్ఠ మగువర్తనముం దగ నిర్వహించుచున్
    భేదము లేనిభక్తి నతినిర్మలవృత్తిగఁ జేయుచుండి మ
    త్పాదనిరంతరస్మరణతత్పరభావముకల్మి నాత్మస
    మ్మోదముఁ బొంది కావ్యరసముం గొనియాడుచు నుండు దెప్పుడున్.

అని సోమయాజి తనకుఁ గలవైదికమార్గనిష్ఠ మగుప్రవర్తనమును, హరిహరులయెడ భేదము లేక సమభక్తి కల్గి యుండుటయును స్మరియించి తదుభయ సగుణమూర్త్యధిదేవత యగుహరిహరనాథునియెడ నిరంతరభక్తి గల్గి యాత్మానందానుభవంబు గల్గి యున్నట్లు చెప్పెను. ఇట్లుగా స్వప్నంబు గల్గినట్లుగ మిషఁ గల్పించుకొని స్వాభిప్రాయ ప్రకటనము చేయుట పూర్వకవులలో నాచారమై యున్నట్లు కాన్పించును. ఇందులో నప్పకవిస్వప్నమువలె దేశచారిత్రము లేదు కావునను, స్వప్నములో నుపాసకులకుఁ దదుపాసనాదేవతలును, అన్యులకు జాగ్రత్పరిదృశ్యమానప్రపంచవస్తు విశేషంబులు నగపడుట సహజము కావున దానిని నమ్మినను నమ్మకయున్ననుఁ బాఠకులకు బాధక మేమియు లేదు. కాని స్వప్నములను నమ్మి వానిని గ్రంథస్థముఁ జేసినయాంధ్రకవులలో నీతఁడే మొదటివాఁడు. భగవదుపాసనాపరులకుఁ దన్మూలముగ నంతఃకరణపరిపాకము కల్గి యిట్టిభగవదనుగ్రహసూచకస్వప్నంబు లగుటయు విశేషమహత్తులు లభ్యమగుటయు నైసర్గికములే యని యాస్తికులకు విశేషించి చెప్పవలసినది లేదు. సోమయాజియు నట్టియుపాసనాబలంబున విజ్ఞానసంపన్నుఁ డై భారతరహస్యార్థములఁ దెలిసికొని వేదముం బ్రకటించినచతురాననప్రతిష్ఠ నంది యుండె నని చెప్పుటకు సందియము లేదు. ఇట్టిఘనకార్యము నిర్వహించుటచే నీసోమయాజియనంతరకాలములోని పురాణకవులలో విశేషజ్ఞులు సోమయాజిని జతురాననుఁడే యని నుతియించుచు వచ్చిరి.