ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు.

గ్రంథకర్త పీఠిక.

ఆంధ్రభాషాభిమానులతో నిపుడీ గ్రంథము మరల రెండవకూర్పున బ్రకటించునట్టి సంగతి విజ్ఞాపనము చేయుచున్నాడను. ఇది ప్రథమములో నేను స్కూలులో విద్యాభ్యాసము చేయుచున్నతరి నింగ్లీషు భాషలో నుండు "Macaulay's Critical and Biographical Essays of Poets" అను గ్రంథమువంటి గ్రంథ మాంధ్రభాషలో నుండిన నెంతయు నుపయోగకారిగా నుండు నని యూహించి యావిషయమై కొందరు పెద్దలతో సహవాసము చేసి కొంతగ్రంథము సంపాదించి దేశస్థుల యభిప్రాయము లరయుటకు గాను గొంతకొంతగా 1876 సం.రము మొదలు ప్రకటింప నారంభించినాడను. అంతట నందులోని రెండవ భాగము ఆ 1882 వ సంవత్సరములో B. A. పరీక్షకు బఠనీయ గ్రంథముగా నేర్పరుపబడుటంజేసి యాభాగము మాత్రము మరియొకపరి ముద్రించి ప్రకటింపబడినది. అనంతరము మరికొన్నిభాగము లపుడపుడు శ్రీప్రబంధకల్పవల్లి యనుపత్త్రికలో గల్పి ముద్రింపబడినవి. అవియన్నియు నేకసంపుటముగ లేకున్నను, శాలివాహనశకము పదియవ శతాబ్దము మొదలు పదియేడవ శతాబ్దము వరకు నుండెడు కవుల యొక్క చారిత్రములు దొరకినమట్టుకు బ్రచురింపబడినవి. అంతట దేశచారిత్ర విషయమైన్ చేయుచున్న కృషి యధికమగుటచేతను నందులోనే కవిచారిత్రములకు వలయు కాలనిర్ణాయాదికము చేయుటకధారము లనేకము లుండుటంబట్టియు నట్టిపని చేయుట సులభసాధ్యము కాకుండుట చేతను బూర్తిగా గవిజీవితగ్రంథము రెండవకూర్పుగా నచ్చువేయించుటా కవకాశము చిక్కలేదు. ఇట్లుండ, బ్ర. కందుకూరి వీరేశలింగముగారు తమ మిత్రులెవ్వరో తమ్ము గవిచరిత్రములు తిరుగ రచియించుటాకు బ్రేరేపించినారని కవిచారిత్రములను పేరుతో నొకగ్రంథము ప్రాచీనకవులం గూర్చిన భాగమును ముద్రించి ప్రకటించిరి. అందు బెక్కండ్రకవుల పేళ్ళును వారి చారిత్రములును వ్రాసినట్లున్నను చాలభాగ మిదివఱలో నాచే బ్రకటింపబడిన కవిజీవితముల యర్థసంగ్రహమే కాని వేఱుకాదు. ఏవియైన నొకటి రెండుకథలు నవీనముగా గాన్పించుటకు జేర్పబడినను నవి యనవసరమైన చారిత్రములుగా నైనను లేక ప్రత్యేకము కవిత్వశైలిం జూపుటకు