ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేములవాడ భీమకవి

39

76. అనేక రాజకులసంస్థాననిర్వాహకబిరుద -

77. మహారాష్ట్రాబ్ధిమంథనుండు - వీరిదేశమునకు మహారాష్ట్రసేనలు వచ్చినపుడు వారిని జయించి పాఱఁదోలుటచేతఁ గలిగినది.

78. దేవబ్రాహ్మణక్షేత్రపరిపాలన పాండవాగ్రజుఁడు - వీరి సంస్థానమున వేలకొలఁది బ్రాహ్మణాగ్రహారములును, మాన్యములును, దేవబ్రాహ్మణుల కీయఁబడినవి. అట్టివానిని సంరక్షించె నని యర్థము.

79. గజపతినామాంకప్రభుఁడు - గజపతి యనుబిరుదు సంపాదించెనని యర్థము.

80. యవనపరాసుసైనికభూధరకులిశాయుధుఁడు - యవను లనఁగాఁ దురష్కులను ఫ్రెంచివారినిగూడ జయించె నని యర్థము.

ఆంగ్లేయులు మనయాంధ్రదేశములోనికి వచ్చినపిమ్మట వారివంశజులచే సంపాదింపఁబడినబిరుదు లాయాయుచితస్థలంబులలో వివరింపఁబడును. ఇవి యన్నియు నవీనములు. పై నుదాహరింపఁబడినవి ప్రాచీనములు. కావున వానినిమాత్రమే వివరించియున్నారము.

పైబిరుదాంకము లన్నిటింబట్టి చూడ మైలమభీమునివంశస్థుల కొక్కొక్క కాలములోఁ గొలిపాకయుఁ, గేతవరమును, బెజవాడయుఁ, గుంభిళాపురమును, విజయనగరమును, ముఖ్యపట్టణము లయి యుండెననియును; ధారాపురము, నెల్లూరు, యెలమంచిలి, కంచి, దేవగిరి, కటకపురి, చెంజి, ద్వారకాపురము మొదలగుపట్టణములపై దండెత్తి వెడలి వానిని స్వాధీనపఱుచుకొనినట్టును, మేదినీరాయ, మాళవరాజ, కర్ణాటరాజ, కళ్యాణరాజ, కళింగరాజ, కిమిడిరాజ, భల్లాడ, ఒడ్డియరాయ, ఏళరాయ, రేచర్లగోత్ర, యవనసైనిక, చోళరాజ, పావురాయ, రాయసంస్థాననృప, పరాసుసైన్య జయాంకబిరుదులును, చాళుక్యరాజరాజ్యస్థాపన, అనేకరాజకులసంస్థాన నిర్వాహకబిరుదులు చెల్లినట్లును గాన్పించును. వీని నన్నిటిం బట్టి చూడ నీమయిలమ భీమునివంశస్థు లెంతదేశమునకుఁ బ్రభుత్వము చేసిరో యెందఱు రాజులతో సంబంధము గలిగియుండిరో బోధపడకపోదు.