ఈ పుట అచ్చుదిద్దబడ్డది

474

కవి జీవితములు.

    వదనచంద్రునిఁ గొల్చి బ్రదికెడు చీఁకట్ల, గతి నవశ్మశ్రురేఖలు జనించె
    నర్థిధైర్యములపై నడరు కెంపునుబోలె వీక్షణాంచలముల నెఱ్ఱతోఁచె

గీ. సుందరత్వమునకుఁ జో టిచ్చి తాసంకు,చించె ననఁగ గడుఁ కృశించె నడుము
    బసవరాత్మజునకు సకలలోకోత్సవా, పాదియైనయౌవనోదయమున."

దీనిలోఁ మనము చెప్పవలసిన దేమున్న దనఁగా నలసానిపెద్దనార్యునివలన మనుచరిత్రములోఁ జూపింపఁబడిన, 1. జాతకర్మము, 2. ఉపనయనము, 3. విద్యాభ్యాసము, 4. యౌవనావిర్భావములు కవికర్ణరసాయన కవివలనఁ బ్రత్యేక ప్రత్యేకము పద్యములతో నతిప్రౌఢ వర్ణనలఁ బ్రకాశింపఁజేయఁబడినవి. దీనింబట్టియుఁ బైపురవర్ణనముం బట్టియు మనుచరిత్రకవికంటెఁ గవికర్ణరసాయనకవి వర్ణనాంశములు పెంచి కథాభాగమును దగ్గించె నని సూచింపఁబడుచున్నది.