ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంకుసాల నృసింహకవి.

463

వాక్యమునకు నలరి ఏది పద్యమంతయుఁ జదువుమనుడు నాపె యట్లు కావించెను.

కృష్ణరాయం డాపద్యమున కలరి అది యేవారికవిత్వ మనుడునా చిన్నది తాఁ గవి నెఱుఁగ ననియుఁ దాను వాని విలిచితి ననియుఁ జెప్పిన రాజు విని విస్మితుండై దిగ్గున లేచి యాస్థానంబునకుం జనుదెంచి ఆపద్యంబు చదివి యిది యెవరికవిత్వ మనుడు నచ్చో నున్న కొందఱు కవికర్ణరసాయన మను కృతిలోని దని తెల్పి ఆకవి అచటికి వచ్చుట మొదలగువృత్తాంతంబు చెప్పిరి. ఆమాట విని రాజు మిక్కిలి వగచి అతనికి వర్తమానంబు పంపె. ఆకవియును తనగ్రంథంబు రంగనాథునకుఁ గృతినిచ్చుట మొదలగు వృత్తాంతంబులు జెప్పిపుచ్చెను. ఆమాటలు విని కృష్ణరాయం డెంతయుఁ జింతించి ఆగ్రంథంబైన తనకడకుఁ బంపినఁ జూచెద ననుడు నాకవి తనగ్రంథంబును రాజునకుం బంచె. దానిలోని విశేషంబులకు రా జెంతయు నాశ్చర్యంబు నంది హా ! ఇట్టి గ్రంథంబునకుఁ దాఁ కృతిపతి యగు భాగ్యంబు పట్టదయ్యె నని చింతించి తా నట్టిగ్రంథం బొకదానిని రచియించినంగాని తన విచారంబు పో దని నిశ్చయించి యపు డాముక్తమాల్యద రచియించి నని కొందఱ యభిప్రాయము. అట్టిగ్రంథము తన పేరిట రచియించి ప్రకటించుటయే పెద్దనకుఁ దగు నపరాధముగా నూహించి బెద్దన నట్లు నియమించె నని మఱి కొందఱయభిప్రాయము. పెద్దనయెడ రాజునకుం గల గౌరవాధిక్యముం బట్టి యిట్టి యమర్యాద కార్యంబు చేయునా యని యూహించ వలసి యున్నది. ఏది యెట్లన్నను పెద్దన యాగ్రంథము రాజుకడకుం బోక యుండఁ జేసినట్లు ప్రతీతి కలదు. ఆంధ్రకవిచరిత్రములో.

‘ఆంధ్రకవితాపితామహుఁ డయినయల్లసానిపెద్దన్న యంత యసూయాగ్రస్తుఁ డగుటకుఁ దగినకారణమేమియుఁ గానరాదు. కవికర్ణరసాయనము మొత్తముమీఁద మంచిదే యయినను పెద్దనార్యకృత మైనమనుచరిత్రముకంటె నేవిషయమునందును గుణాతిశయము కలది కాదు.’