ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిండిప్రోలు లక్ష్మణకవి.

437

లో నగు పెండ్లిండ్లకుఁ బిలువంబడినప్పుడు కవిత్వగౌరవతాంబూలము తనకే యిచ్చునట్లుగాఁ బ్రసంగించుచు వచ్చెనఁట. అట్టియాచారము క్రమముగ బలము కాఁగా నతఁడు పెండ్లికిఁ బోయినను పోకున్నను మహాజను లతని సభాతాంబూలం బతనికిఁ బంపుచుండిరఁట. అటులఁ గొన్నిదినములు జరిగినపిమ్మటఁ దనకుఁ గట్నము పంపక యెవరైన నతఁడు రా లేదని ఆక్షేపణ చెప్పునెడల లక్ష్మణకవి వారితోఁ దాను రాకయుండినఁ బెండ్లి యె ట్లగు ననియుఁ దాను వచ్చియే పెండ్లిపూర్తి జేసియుంటి నని పల్కు చుండునఁట. దానికిఁ గారణ మీక్రింది విధముగాఁ జెప్పు చుండునఁట. ఎట్లన్నను :- మీయింట జరిగినపెండ్లిలో నాకబలి జరిగెనా లేదా ? అట్టినాకబలికి పిండితో ప్రోలుపోసియుంటిరా లేదా ? అటుపిమ్మట నది లక్షణముగా నుండెనా లేదా ? కాదంటిరేని వివాహసిద్ధి లేదు. పైగా నశుభప్రసంగ మగును. అగునంటిరేని పిండి ప్రోలు లక్ష్మణలక్షితము కాఁగాఁ బిండిప్రోలు లక్ష్మణకవి సాన్నిధ్యమున లేఁ డని యెట్లుచెప్పవచ్చు నని చమత్కరించి కట్నములం గైకొనినట్లు చెప్పంబడును. ఇట్టిపట్లనే దమ్మన్న రావునకు నీతనికి విరోధము కల్గె నని చెప్పుదురు.

లక్ష్మణకవి తనమేనల్లుని వ్యవహారములోఁ బ్రవేశించుట.

ఈలక్ష్మణకవి మేనల్లుఁడు చింతలూరిమిరాసీదారుఁ డగుమంగన్న యనునతఁ డుండెను. అతఁడు జగ్గరా జనునొకజ్ఞాతికి దత్తతకావింపఁబడియెను. ఆవృత్తాంతముఁ దెలిసికొనినజ్ఞాతులు జగ్గరాజు గతించిన పిమ్మట మంగన్నకు సంక్రమించిన గృహక్షేత్రారామములంగూర్చి పండితనదరమీనుకోర్టులో రాజమహేంద్రవరములో దావా తెచ్చి యుండిరి. అపుడు శంకరమంచి అనంతంపంతు లనుబ్రాహ్మణుఁడు పండితనదరమీనుగా నుండెను. అతఁడు మంగన్న దత్తుఁడు కాఁ డని తీర్పుచేసి అతనిస్వాధీనములో నుండెడి జగ్గరాజుయొక్క చరస్థిర రూపపదార్థము లన్నియును జగ్గరాజుయొక్క సన్నిహితజ్ఞాతులపర మొనరించెను. అట్టి