ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిండిప్రోలు లక్ష్మణకవి.

407

నల్గురుకుమారు లుండిరి. వారి నల్వురికిని గ్రమముగ వివాహము లొనరించె. అందుఁ బెద్దకుమారుఁ డగుతిరుపతయ్యకు రమణమ్మయను చిన్నదానిని, రామకృష్ణయ్యకు తిరుపతమ్మ యనుచిన్న దానిని, లక్ష్మణకవికి జగ్గమ్మ అనుచిన్నదానిని, రామయ్యకు వేంకటలక్ష్మి యనుచిన్న దానిని వివాహము చేసెను. ఇట్లుండఁ గొందఱు బ్రాహ్మణుల బృందములు వచ్చి గోపాలమంత్రిని ధన మిప్పింపుఁ డని యాచింపఁగ నాతండు వారల కట్లే యిచ్చెను. ఆధనముం గైకొని వారలు సంతోషించి అతని నతనిపుత్త్రులను దీవించి చనిరి.

ఇట్లుండ గోపాలమంత్రి తనచుట్టునుం బరివేష్ఠించి యున్నసభ్య జనులయనుమతంబున ప్రతిభాసంపన్నుఁ డగు తనపెద్దకుమారుని తిరుపతయ్యను బిలిచి నియోగులలో నుండునట్టి యాచారానుసారముగా వ్యవహారము నడుపుకొమ్మని ఆజ్ఞ యిచ్చెను. అనంతరము గోపాలమంత్రి తనభార్య రాజమ్మ స్వర్గస్థురాలు కాఁగా రెండవవివాహమాడెను. ఆరెండవభార్యపే రచ్చమ్మ. అట్లు వివాహమైన యనంతరము. తిరుపతయ్యకు వేఱ యొక లోఁగిలి కట్టించి అం దాతనిఁ గాఁపుర ముంచెను. అతఁ డట్లుండి యిర్వురు పుత్త్రులం బడసి పిదప కాలధర్మము నందెను. ఇట్టిపుత్త్రదుఃఖములో నుండిన గోపాలమంత్రి క్రమముగఁ గృశింపనారంభించి మఱికొన్ని నాళ్లకు నిర్యాణము నందెను.

అంతట గోపాలమంత్రి రెండవకుమారుఁ డగురామకృష్ణయ్య తనతండ్రికి నుత్తరక్రియలు గావించి కుయ్యేరు గ్రామమునకుఁ గరిణీకకమును వహించెను.

ఇ ట్లుండి యొక కాలమున నీరామకృష్ణయ్య తమ్ములను వెంటఁ బెట్టుకొని ఆత్రేయీనామక గోదావరీశాఖలో స్నానమునకుం బోయి సుస్నాతుఁ డై తిరిగి యింటికి వచ్చుచు నచ్చట వేంచేసియున్న గోపాలస్వామి యాలయమునకుం బోయి ఆస్వామి ననేకవిధముల నుతియించి సాష్టాంగదండప్రణామం బాచరించి వెడలి శివాలయంబునకుం బోయి