ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాజభూషణకవి.

361

ఈపద్యములోఁ జేసినవర్ణనయంతయు కేవల మాంజనేయమంత్రకల్పప్రోక్తమహిమానువర్ణనమే కాని వసుచరిత్రములోను హరిశ్చంద్రనళోపాఖ్యానములోను జెప్పినవిధముగ రామభక్తిపరాయణత చే నాంజనేయునకుఁ గల్గినమహిమా విశేషములుగా వర్ణింపఁబడవు. అందు వసుచరిత్రయందలి వర్ణన.

సీ. తరుణార్కకబళ నోద్ధతిఁ జూపె నెవ్వాఁడు, రుచులచే ఫలమోహరుచులచేత
    అకలంక రామముద్రికఁ బూనె నెవ్వాఁడు, శయముచే హృత్కు శేశయముచేత
    మున్నీరు పల్వలంబుగఁ దాఁటె నెవ్వాఁడు, జవముచే గుణగణార్జవముచేత
    అక్షశిక్షాప్రౌఢి నలరారె నెవ్వాడు, రణముచే నియమధారణముచేత

తే. ధరణి, నెవ్వాఁడు దానవద్ద్విరదదళన, విహృతిఁ దనకేసరికిశోరవృత్తిఁ దెలిపె
    నతని మత్కావ్యమంజువాగమృతఘటన, మంజులస్వాంతు హనుమంతు మతిఁదలంతు.

            హరిశ్చంద్రనళోపాఖ్యానములో :-

సీ. రామభక్తునకు భారమె ఘోరపంకాబ్ధి, తరణపాటవ మన శరధి దాఁటి
    రామభృత్యున కరుదా మృత్యునిరసనం, బన మహాఛాయాగ్రహంబుఁ జేరి
    రామకింకరున కబ్రమె రమాసాన్నిధ్య, మన విదేహాధీశతనయఁ గాంచి
    రామైకమతికిఁ జిత్రమె పాశవిగళనో, పాయం బన నజాస్త్రబంధ మెడలి

తే. రామపరతంత్రునకు దుర్భరంబె విలయ, వహ్ని యన వాలశిఖి శిఖావ్యాప్తి నోర్చి
    యరిపురం బేర్చినయజేయు నప్రమేయు, నాంజనేయు మునిధ్యేయు నభిమతింతు.

నరసభూపాలీయకవికి రామవర్ణనఁ జేయుప్రసక్తి కల్గెనా యను దాని నూహింతము. కృతిపతివంశము వర్ణించుచుఁ జెప్పిన సూర్యవంశానువర్ణనములోఁగూడ నరసభూపాలీయకవి శ్రీరామవర్ణనములో విశేషవర్ణన చేయక అతనిపూర్వులందఱతోఁ గలిపి సామాన్యముగా వర్ణించియున్నాఁడు. చూడుఁడు.

సీ. భవ్యుఁ డాతఁడు దీర్ఘబాహునిఁ గనియె నా,తఁడు గాంచె రఘువు నాతనికిఁగలిగె
    బురుషాదుఁ డతనికిఁ బొడమెఁ గల్మాషపా, దుఁడు తత్సుతుఁడుశంఖనుఁడుసుదర్శ
    నుఁడు తత్తనూజుఁ డాతఁడు గాంచె నగ్ని వ,ర్ణ మహీశు నతఁడు శీఘ్రగునిఁ బడసె
    నతనికి మరుఁడు తదాత్మజుఁడు శుజుఁ డా,తని కంబరీషుఁ డాతనికి నహుషుఁ

తే. డతనికి యయాతి నాభాగుఁ డతని కతని, కజుఁడు దశరథుఁ డతనికి నతని కొదవె
    రామభద్రుఁడు తద్వంశరత్న మయ్యె, సొరిదిఁ గలివేళ గలికాలచోళవిభుఁడు.