ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

కవిజీవితములు.

ఆంధ్రద్వ్యర్థికావ్యకవులచరిత్రము.

15.

రామరాజభూషణకవి.

ప్రబంధాంకము రామరాజభూషణుఁడు హరిశ్చంద్రనలోపాఖ్యాన గ్రంథకర్త. ఆంధ్రములో రాఘవపాండవీయముతో సమానమై అంతకంటెను గవిత్వశయ్యాదులలో గౌరవాధిక్యము నందినకావ్య మీహరిశ్చంద్రనలోపాఖ్యాన ద్వ్యర్థికావ్య మైయున్నది. అట్టికావ్యములోని విశేషముల నుడువుటకుఁ బూర్వ మాకావ్యమును రచించినకవి యెవరు అనుసంప్రశ్నముంగూర్చి వ్రాయవలసియున్నది.

నరసభూపాలీయకర్త యగుభట్టుమూర్తియే దీనినిఁగూడ రచియించినట్లు వాడుక గలదు. అట్లు కాదనియు నీయిర్వురు వే ఱనియు సంగ్రహముగాఁ గొన్నిమాటలు పూర్వము నాచే రచియించఁ బడిన కవిజీవితపుమొదటికూర్పులో వ్రాయంబడినవి. అట్టివానినిఁ దిరస్కరించి కొందఱును బలపర్చి కొందఱును వాదింప నారంభించిరి. పిమ్మట నందులో నిర్వురు పండితు లీవిషయమై విస్తారము సంవాదము చేసి వారియభిప్రాయముల వ్యక్తీకరించుచుఁ గొన్ని గ్రంథములు వ్రాసి ప్రకటించిరి. అట్టి గ్రంథములు రెండును నాకడకు వచ్చి యుండుటంజేసియు నేను తిరుగ నాకవిజీవితములను రెండవకూర్పునఁ బ్రకటించుచుండుటంజేసియుఁ బైపండితులగ్రంథంబులపై నా వలన నీవఱలో నీయంబడియున్న యభిప్రాయము గలయొకసిద్ధాంతోపన్యాసము నిందులో ముందు ప్రకటించుట మంచి దని యెంచి