ఈ పుట అచ్చుదిద్దబడ్డది

344

కవి జీవితములు

లయగ్రాహి.

"చలువ గల వెన్నెలల చెలువునకు సౌరభము కలిగినను సౌరభముఁజలువయుఁ దలిర్పంబొలు పెసఁగుకప్పరపుఁ బలుకునకుఁ గోమలత నెలకొనిన సౌరభముఁ జలువపసయుం గోమలతయును గలిగి జగముల మిగులఁ బెం పెసఁగుమలయసవనంపుఁగొదమలకు మధురత్వం బలవడిన నీడు మఱి కల దనఁగ వచ్చుఁ గడు వెలయఁ గలనీసుకవిపలుకులకు నెంచన్."

అని చెప్పెను.

10 ఉ. ఈకవి కావ్యములందు నాటకశైలి కాన్పించుచున్నది. శ్రవ్యకావ్యముల యం దున్నరమ్యత శ్రవ్యకావ్యములయం దున్నది. దృశ్యకావ్యములయం దున్నరమ్యత దృశ్యకావ్యములయం దున్నది. వీనిరెంటిని గలిపి వ్రాసినయెడల నెంతమనోహరముగాఁ గూడునో వేఱే చెప్ప నక్కఱ యుండదు.

చా. నాటక శైలియును దానికంటెఁ బ్రసంగశైలి యని చెప్పిన నది లెస్స యై యుండును. ప్రబంధాదులు కేవలము శ్రవ్యకావ్యములై నప్పటికి నిందు ప్రసంగశైలి యుంచుట ప్రౌఢకవులలోఁ గాన్పించు. తారాశశాంకవిజయాది శృంగారరసప్రబంధకవులు గూడ నీశైలినే అవసరసమయములలో నవలంబించుచు వచ్చిరి. అంతమాత్రమున నాంధ్రములలో నీవఱకు లేనినాటకఫక్కిక నీసూరకవి కల్పించె నని చెప్ప నొప్పియుండదు.

11 ఉ. అంశము లన్నియు నాటకములవలె నెట్లు వర్ణింపఁబడినవి. సంధివచనములు లేనిచోఁ గావ్య మెల్ల రూపక మగు నని యెంచెదను. ఈవిషయముల నెల్లఁ జాగ్రత్తతోఁ బరీక్షించి చూచినపుడు సూరనకు నీతనిసమకాలికు లగునితరకవులకు నెట్టితారతమ్యము కలదో స్పష్ట మగును. ఇతరమాధ్యమిక కవులందఱికంటె నీతఁడు వేయిమడుంగు లెక్కు డని యొప్పుకొనకతీఱదు.

చా. నాటకపద్ధతింగూర్చి యిదివఱకే వ్రాసియున్నాను. నాటకఫక్కి ఆంధ్రంబునకు లేదు. సంధివచనములే నాటకమునకు ప్రధానాంగములు కావు. నాటకమునకు ప్రస్తావనాద్యంగము లుండును. అవి యుండనిచో దానికి నాటకనామము చెల్లదు. ప్రసంగశైలివిశేషముగా నున్నంత మాత్రమున నిది యొకవిశేషముగా నెన్నంబడదు. ఇతరమాధ్యమికకవు లందఱికంటె నీతఁ డెక్కువవాఁ డని చెప్పుటయే సాహసకృత్యము. అట్టిచో వేయిమడుంగు లెక్కు డని చెప్పినమాట అర్థము లేనియత్యుక్తి యనక తప్పదు.