ఈ పుట అచ్చుదిద్దబడ్డది

312

కవి జీవితములు

"శా. రెండర్థంబులపద్య మొక్కటియు నిర్మింపంగ శక్యంబు గా
      కుండున్ దద్గతిఁ గావ్యమెల్ల నగు నే నోహో యన్ జేయదే
      పాండిత్యంబున నందునుం దెనుఁగుఁగబ్బం బద్భుతం బండ్రు ద
      క్షుం డెవ్వాఁ డిల రామ భారతకథల్ జోడింప భాషాకృతిన్."

ఉ. భీమన తొల్లి చెప్పె ననుపెద్దలమాటయ కాని యందు నొం
    డేమియు నేయెడ న్నిలుచు టెవ్వరుఁ గాన ర టుండ నిమ్ము నా
    నా మహిత ప్రబంధ రచనా ఘన నిశ్రుతి నీకుఁ గలుటన్
    నామదిఁ దద్ద్వయార్థకృతి నైపుణియుం గల దంచు నెంచెదన్.

ఈ రెండు పద్యములం బట్టి యాలోచింప నంతకుము న్నాంధ్రభాషయందు ద్వ్యర్థికావ్యములు లే వనియును, భీమకవి అట్టికావ్యరచనకై ప్రయత్నించి దానిని వదలివేసె ననియును, కావున ననన్యసాధ్యముగా రామభారతకథలు జోడింపు మని చెప్పినట్లు నున్నది. దేశములోనివాడుకయు రాఘవపాండవీయమే మొదటిద్వ్యర్థికావ్య మనియు హరిశ్చంద్రనలో పాఖ్యానము రెండవద్వ్యర్థికావ్యమనియుఁ గలదు. కాఁబట్టి పైగ్రంథకర్త లగుసూరకవియు, రామభూషణకవియును నేక కాలీను లైనం గావలయును. లేనియెడల మొదటికవి రెండవకవికి ప్రాచీనుఁ డైనం గావలయును. ఈరామభూషణకవి కృష్ణరాయనియల్లుం డగునళియ రామరాజుకడ నుండెడు పండితుఁడు. కావున రామరాజుకాలీనుఁ డై కృష్ణరాయలకాలీనుఁడుగూడ నైనాఁడు. సూరనకవి రామభూషణకవి కాలీనుఁడైన గృష్ణరాయనియల్లునికాలమువాఁ డగును. అంతకుఁ బూర్వుఁడే యయినఁ గృష్ణరాయనికాలీనుఁడే యగును. కావున నీవిషయమున శంకించం బనియుండదు. ఇదివఱకే అల్లసానిపెద్దన దౌహిత్రికి పెనిమిటి సూరకవి యైన నై యుండవచ్చు నని చెప్పియుంటిమి. అల్లసాని పెద్దన మనుచరిత్రము రచియించునాఁటికి ముసలివాఁడై యున్నట్లుగాఁ దెలియవచ్చుచున్నది. అతనికడనే భట్టురామభూషణుఁడు బాలుఁడై యుండి కవిత్వమును నేర్చుకొనునట్లు చెప్పెడుకథ లున్నవి.