ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగళిసూరన.

301

యాధారములు లేనిది ప్రత్యేకము పై (లోకల్ రికార్డుస్ లోని) వ్రాఁతలను నమ్మి సిద్ధాంతము చేయఁగూడదు. ఆవృత్తాంతములు తత్కాలీనులవలన వ్రాయఁబడక ఇప్పటికి నూఱుసంవత్సరములకుఁ బూర్వమున నున్న యాగ్రామజనులవలన విన్న వృత్తాంతములఁ బట్టి వ్రాయంబడినవి. ఒక వేళ పైకథలు నమ్మఁ బడినను పింగళిసూరనకవి కళాపూర్ణోదయముం జేసినకాల మదియే యని చెప్పుటకుఁగాని అప్పటికే అతఁడు ముదుసలి కాక యుండె నని చెప్పుటకుఁగాని ఆకథ చాలదు. శా. 1490 సం. నాఁటికే సూరకవి కళాపూర్ణోదయమును రచించి అప్పుడు అధికారము చేయుచున్న తిమ్మరాజు తమ్ముం డగుకృష్ణరాయలకుఁ గృతియీయ వచ్చునప్పటికే సూరకవి మిక్కిలి ముసలివాఁడై యుండవచ్చును. కళాపూర్ణోదయము కృతి నందినకొంతకాలమునకుఁ గృష్ణరాయఁడే ప్రభుండై వెంకటపతిరాయలు పెనుగొండలో రాజ్యముచేయుచున్న కాలములోఁగూడ నుండవచ్చును. అంతమాత్రమున సూరనకూడ వెంకటపతిరాయల కాలములోనివాఁ డని యూహింప వీలుపడదుగదా శా. 1490 నాఁటికేఃసూరకవి యేఁబది అఱువదిసంవత్సరములయీడువాఁ డయ్యె నేని అతనిజనన కాలము శా. స. 1420 గల కాలమై యుండును. అప్పుడు సూరకవి పదునేనవ శతాబ్దపూర్వఖండములోనివాఁ డని చెప్పవలసియుండునుగాని పదియాఱు పదు నేడు శతాబ్దములలోనివాఁ డయినట్లు నిశ్చయింపఁగూడదు. కావున నీసిద్ధాంత మంగీకరింప వీలుపడదు.

ఆంధ్రకవిచరిత్రముపై విమర్సనము.

ఇఁక నాంధ్రకవిచరిత్రములోఁ జేయంబడినసంవాద మీపైదానికంటె విపులముగా నున్నను పాఠకునకు మఱియును దిగ్భ్రమ నందించును. కావున దానిలోనియంశములను వేర్వేఱుగ వివరించి దానిపైఁ బూర్వపక్షములం దెల్పెదను. గుణగ్రాహు లాసిద్ధాంతములోఁ గలభేధములం గనిపెట్టెదరు గాక.