ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

285

వమే యగును. ఈశ్రీనాథుండు ప్రభునియొద్దఁ ప్రవేశము గల్గించుకొనుటయ కాక యతని కనన్యసాధ్య మగుకృతి నిచ్చి యతనివలనఁ గృతిసదృశ మగుగౌరవము నందియుండును. దాని కాతనిసభలోనిపండితులు తార్కికులు కుయుక్తిని నెగతాళి చేసియుందురు. దానిఁకిగాను శ్రీనాథునివలనఁ బైపద్యము రచియింపంబడియుండును. ఆపండితులు చేసిన యాక్షేపణలు జీర్ణములై హృద్గతములైనవియు శ్రీనాథునియాక్షేపణ శాశ్వతమైనదియు నయ్యె. ఆపద్యములో రసము తక్కువ యవుటంజేసి దాని నిట వివరింపక రాజమహేంద్రవరము పండితులమార్గము గైకొనిన పండితు లున్నచో శ్రీనాథకవిమార్గము గై కొన్న గ్రాంథికు లుండుట గూడ సహజ మనియు, అది యుభయపక్షములం గూడ దనియు విప్పి చెప్పెదను.

ఈవీథినాటకవిశేషములు నాదేశచారిత్రములో మరల విస్తరింపఁబడుం గావున నిప్పటి కీగ్రంథముంగూర్చి విస్తరింపను. శ్రీనాథకవిచారిత్రములోఁగూడఁ పెంచి వ్రాయుట కాధారములు లేవు గావున నింకొకవృత్తాంతంబుతో దీనిని ముగించెదను. అది యెద్ది యన శ్రీనాథునిచరమావస్థలోఁ జెప్పఁబడె నని యాంధ్రకవి చరిత్రములో వ్రాసిన పద్యవిమర్శనము. అం దె ట్లుండె నన :-

"శ్రీనాథుఁడు తన కాశ్రయు లైనవేమారెడ్డియు వీరభద్రారెడ్డియు మరణము నందినతరువాతఁ గూడఁ గొంతకాలము బ్రతికియుండెను. ఆకాలమునం దతఁడు కృష్ణాతీరమునందు బొడ్డుపల్లె యనునొకగ్రామము గుత్తచేసి నదీప్రవాహమువలన సస్యము పోఁగా గుత్తధనము రాజునకుఁ గట్టలేక వారిచే బహువిధము లైనబాధలు పొంది తుదకు మిక్కిలి బీదతన మనుభవించెను. ఈసంగతి శ్రీనాథకృతము లైనయీ క్రిందిపద్యములవలన నెఱుఁగవచ్చును :-

సీ. కవిరాజుకంఠంబుఁ గౌఁగిలించెనుగదా, పురవీథి నెదురెండ పొగడదండ
    సార్వభౌమునిభుజాస్తంభ మెక్కెనుగదా, నగరివాకిట నుండునల్లగుండు
    ఆంధ్రనైషధకర్తయంఘ్రియుగ్మంబునఁ, దగిలియుండెనుగదా నిగళయుగము
    వీరభద్రారెడ్డి విద్వాంసుముంజేత, వియ్యమందెనుగదా వెదురుగొడియ.