ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

కవి జీవితములు

వ. అప్పుడు నన్నుం బిలువం బంచి సముచితాసనంబునం గూర్చుండ నియమించి యున్న యవసరంబున.

గీ. రాయవేశ్యాభుజంగసంగ్రామపార్థ, గాయగోపాళవేమనక్ష్మావరుండు
    కూర్మియనుజన్ముహృదయంబుకోర్కి యెఱిఁగి, యర్థి ననుఁ జూచి యిట్లని యానతిచ్చె.

గీ. నైషధాదిమహాప్రబంధములు పెక్కు, చెప్పినాఁడవు మాకు నాశ్రితుఁడ వనఘ
    యిపుడు చెప్పఁ దొడంగినయీప్రబంధ, మంకితము సేయు వీరభద్రయ్య పేర.

పైపద్యములలోఁ "గర్ణాకర్ణికగా" అని వ్రాసి యుండుటంబట్టి శ్రీనాథుఁ డదివఱకు పై రాజమహేంద్రవరపురెడ్లసభలో (లేక) అక్కడక్కడ కాలక్షేపము చేయుచున్నట్లును, అనంతరము కాశీఖండముమూలముగ వేమా రెడ్డిసభలోఁ బ్రవేశము నందినట్లును గానుపించును

శ్రీనాథుఁడు పైవిధంబున గ్రంథరచనకై కోరంబడి కాశీఖండములోఁగూఁడ నింకొకపరి వేమభూపాలునివంశవర్ణనముం జేసె.

వీథినాటకము.

ఈ వీథినాటకముంగూర్చి శ్రీనాథకృతము లగుగ్రంథములలో నతనివలన నెక్కడను నుదాహరింపఁబడక పోయినను అప్పకవి మొదలగు తొంటి లక్షణగ్రంథకర్తలు వీథినాటకములోని కొన్ని పద్యముల నుదాహరించి యుండుటచేత నది శ్రీనాథునికృతిగానే నిర్ణయించి దానింగూర్చి యిపుఁ డీచారిత్రములో వ్రాయుచున్నాము. అందలికథాసందర్భముంగూర్చి వ్రాయక పూర్వ మాగ్రంథమువలన దేశచారిత్రమునకుఁ గల్గినయొకలాభము నిచ్చో ముందు వివరించెదము. అది యెద్దియనఁగా ఆంధ్రదేశములో శ్రీనాథునికాలమునఁ గలజాతులును వారి స్త్రీలభూషణాదులును శృంగారవిశేషములును దెలియుటయే. స్త్రీలం జెప్పినప్పుడు పురుషుల జాతులుగూడఁ దెలియును. కావున వివిధజాతులు తెలియుపరిజ్ఞాన మిందువలనఁ గలుగకమానదు. అవి యెవ్వియనఁగా :-

1. విప్రభామ. కేవలము వైదికవృత్తి నుండుబ్రాహ్మణునిభార్య.