ఈ పుట ఆమోదించబడ్డది

వేములవాడ భీమకవి

15



భట్టునకు సమకాలమువాఁ డైనట్టుగా ననేక దృష్టాంతములు గాన్పించుచున్నవి ఎట్లన్నను :-

[1]గీ. భారతముఁ దెనిఁగించుచుఁ దా రచించి, నట్టిరాఘవపాండవీయము నడంచె
   ఛందము నడంచ నీఫక్కి సంగ్రహించె, ననుచు భీమన యెంతయు నడఁచె దాని.

దీనింబట్టి చూడఁగా భారతమును దెనిఁగించుచు భారతార్థమును జెప్పుచున్న రాఘవపాండవీయమును నన్నయభట్టు పూర్వపక్షము చేసె ననియును, దనఛందస్సు నడఁచుటకుఁగా నీనన్నయభట్టు ఆంధ్రశబ్దచింతామణిని సంగ్రహించెఁ గావున దానిని భీమన యణఁచి వేసె ననియును దేలినది. దేని నేది పూర్వపక్షము సేయుట కేర్పడినను నన్నయభట్టునకును భీమనకును బరస్పరమును వైమనస్య మున్నట్లుగా దీనివలన గోచరం బగును. వీరిర్వురును సమకాలీనులు గాక యుండినచో నిట్టివృత్తాంతము జరుగుటయే తటస్థింపదు. అయితే మన మిపు డీయప్పకవి కథయే అసత్య మని సంవాదార్థమై యోజింతము. ఆపక్షములో నన్నయ భీమనలు సమకాలీను లని మఱికొన్ని సాధనములఁబట్టి మనము నిర్ణయింపవలయును. వీరిర్వురకును సమకాలీనులుగా నున్న మఱికొందఱికాలములు మనము తెలిసికొని యనంతరము ప్రస్తుతాంశ మాలోచింతము.

ఇతఁడు చెప్పినచాటుధారాపద్యములలో నక్కడక్కడ రాజకళింగగంగుంగూర్చియుఁ జొక్క రాజుంగూర్చియు సాహిణిమారుంగూర్చియు శృంఖలరాజుం గూర్చియు వచ్చెడి ప్రస్తావనలనుబట్టి యితఁడు వారితో సమకాలీనిఁ డని యూహించుటకుఁ దగి యుండును గదా! వారికాలంబులు నిదివఱకు నిర్ణయింపఁబడక యుండుటంబట్టి మనము సాధ్యమయినంతవఱకు వాని నిర్ణయముఁగూడ నిప్పుడ చేసి దీని నిర్ణయింతము.

భీమకవి చెప్పిన యీక్రిందిపద్యములంబట్టి భీమకవి రాజనరేంద్రునితండ్రి యగు విమలాదిత్యుని సమకాలీనుఁ డని విస్పష్ట మగుచున్నది. ఆపద్య మెట్లన్నను :-

  1. వేములవాడభీమకవి భారతము రచించిన ట్లీపద్యమువలనం దెలియఁబడదు. ఆంధ్రకవిచరిత్ర మత మట్లు కాదు.