ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

కవిజీవితములు.

ఆంధ్రపంచకావ్యకవులచరిత్రము.

13.

శ్రీనాథుఁడు.

ఈకవిరచితము లగుగ్రంథములు పెక్కులు గలవు. అందు శృంగారనైషధమును భీమఖండ, కాశీఖండములును, కావ్యపాకమున నొప్పియుండును. అందు రెండును రెండుకావ్యములుగాఁ బరిగణియింపఁబడును. మఱికొందఱవలన శృంగారనైషధ, కాశీఖండములుమాత్రమే కావ్యములుగా లెక్కింపఁబడును. ఈరెండవపక్షమునే యవలంబించి దీని నిపుడు వ్రాయుచున్నాను.

శ్రీనాథుఁడు భారద్వాజసగోత్రుఁడు, ఆపస్తంబసూత్రుఁడు, నియోగిబ్రాహ్మణుఁడు కమలనాభకవిపుత్రుఁ డగుమారయమంత్రి కీకవి కుమారుఁడు. తల్లి పేరు భీమాంబ. ఇతఁడును నొకసుప్రసిద్ధాంధ్రకవి. భారతకవిత్రయమువారియందు మనయాంధ్రపండితుల కెట్టి గౌరవము గలదో యీ శ్రీనాథునియెడల నట్టి గౌరవమే వారికిఁ గలదు. ఇతఁడు పండితాదరణీయ మగుకావ్యములం జెప్పుటయేకాక స్త్రీశూద్రాదుల కుపయుక్తము లై సులభశైలితో నొప్పు పాటలు పద్యములు రచియించెను. మనదేశములోఁ బెండ్లిపాటలు, మొదలగునవియు, గొల్లలు మొదలగుపాటకపుజాతి పాడుకొను గొల్లసుద్దులు మొదలగునవియును, పగటి వేషగాండ్రు చెప్పెడుకొన్నికథాకలాపములును శ్రీనాథునిచే విరచితములే యని ప్రసిద్ధి గలదు.