ఈ పుట ఆమోదించబడ్డది

వేములవాడ భీమకవి

11

అనుపద్యముచే భీమన రాజుం దీవించి యందు నయాచితముగఁ దననిర్యాణంబు సూచింపఁబడుపదం బుండుటకు నాశ్చర్యం బంది కాలగతి యిట్లున్న దని నిశ్చయించి తనమార్గంబునం బోయెను. అనంతరము రాజకళింగగంగు భీమనకవివరంబు మనంబునఁ దలపోయుచుఁ దిరిగి తా నున్న పగటివేషగాండ్ర మేళంబులోనికిఁ జనియెను. ఆవేషగాం డ్రదివఱకు నచ్చో రాజ్యంబు సేయుచున్నపరరాజుం జూచు చుండిరి. ఆరాజును గాలచోదితుండై భీమకవివరదినంబునాఁ టికి రాజకళింగగంగువేషమును జూచునభిలాషము దనకుఁ గల దనియు నా వేషం బెవరైన వేయఁగలరా యనియు నావేషగాండ్ర నడిగిన వారందఱును సంశయించి యూరకుండిరి. వేషగాండ్రలో నొకఁ డైనరాజకళింగగంగు తాఁ బయలుపడుట కదియ తఱి యని యెంచి యోహితులారా ! నేను కళింగగంగువేషంబు ధరింపఁగలను. అతనిగుఱ్ఱంబును వేషంబును నాయుధంబులును దన కిప్పింపుఁ డని యడుగుఁ డనుఁడు వారును నట్ల కావించిరి. రాజును వానినన్నిటిని నిచ్చుటకు సెల వొసంగెను. ఆమఱునాఁటిసాయంకాలము రాజకళింగగంగు నిజవేషంబు ధరియింపఁగోరి యభ్యంజనస్నా తుండై సాంబ్రాణిధూపంబునఁ దల యార్చి నుదుటఁ దిలకంబు దిద్ది తన దుస్తులఁ గట్టితాజుధరించి కాఁగడావాండ్రం బిలిచి గృహంబు వెలువడి తన ఘోటకసమీపంబునకు వచ్చి దానిపైఁ జెయి వేసి మెల్లనఁ దట్టిన నది తనప్రభుం డవుట గ్రహించి తనసంతసముం జూపురీతి నొకప్లుతంబు గావించినది. దానిం గని కళింగగంగు తాను జయమును గైకొనుట నిశ్చయమనుకొని యశ్వారోహణంబు గావించెను. అట్టి వేషమును జూచి తత్పురంబులోనికొంద ఱాతఁడు నిజమైనరాజు గాని వేషధారి కాఁ డని నిశ్చయించి తోడ నడువ నారంభించిరి. రాజకళింగగంగువేషము వచ్చుచున్న దని తక్కుంగలవేషగాండ్రు చని పరరాజునకుం జెప్పుడు నాతఁ డదికళింగగంగు నవమానించుటకుఁ దగినతఱి యని యెంచి నిండు కొలువుండి వేషంబును లోపలకు రా సెలవొసంగెను. రాజకళింగగంగు సింహాసన సమీపమువఱకు గుఱ్ఱముతోనే వచ్చి యచ్చో దానిని నిల్పి