ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

కవి జీవితములు



చలే దని చెప్పినారు. రామకృష్ణునిచే రచియింపఁబడిన గ్రంథము పాండురంగమాహాత్మ్యమే గాని విజయము కా దని సంప్రదాయజ్ఞులైన పురాతనపండితుల యభిప్రాయము. ఒకవేళ రామకృష్ణకవిప్రణీత మైన మఱియొకగ్రంథ మున్నను నుండవచ్చును. దానిపేరు పాండురంగవిజయమును గావవచ్చును. కాని యది లోకములో హాస్యరసప్రధానుఁడగు రామలింగకవిది కాక తన్నాముఁ డగుమఱియొకకవిదై యుండవచ్చును. కాదేని మఱియొకరిచే నది రచియింపఁబడి రామకృష్ణునిపేరిటఁ బ్రకటింపఁబడి యుండవచ్చును. అటు గానిచో నప్పకవీయాదిగ్రంథములలోఁ బాండురంగక్షేత్రమాహాత్మ్యములోని పద్యములే గ్రహింపఁబడి విజయములోనిపద్యము లేల కైకొనంబడవు. కావున విజయ మనుగ్రంథమును మాహాత్మ్యగ్రంథమువలెనే ప్రామాణికగ్రంథ మని గాని మాహాత్మ్యగ్రంథకర్త యగురామకృష్ణకవిరచిత మని కాని యంగీకరింపఁజాలము. ప్రస్తుతము మనము వ్రాయుచున్న చారిత్రములో రామకృష్ణునికులగోత్రములు మాహాత్మ్యగ్రంథములోఁ జెప్పఁబడినవిధము ననే వివరించుచున్నారము :-

రామకృష్ణకవిగోత్రాదికము.

వీనింగూర్చి మాహాత్మ్యములో నీ క్రిందివిధముగ నున్న యది.

"క. కౌండిన్యస గోత్రుఁడ వా, ఖండలగురునిభుఁడ వఖిలకార్యస్ఫురణన్,
    గుండలితకుండలివి భూ, మండలవినుతుఁడవు లక్ష్మమావరతనయా."

అని యుండుటంబట్టి యితఁడు కౌండిన్యసగోత్రుఁడనియు నితని తల్లిపేరు లక్ష్మమ్మ యనియుం దేలినది. కృతిపతి యితనికవనముంగూర్చి కొంత శ్లాఘించినట్లుగా మఱికొన్ని పద్యము లున్నవి. అం దీతని నివాసస్థలము మొదలగునవి వివరింపఁబడినవి, ఎట్లన్నను :-

"క. నను రామకృష్ణకవిఁ గవి, జనసహకారావళీవసంతోత్సవసూ
    క్తినిధిఁ బిలిపించి యర్హా, సనమునఁ గూర్చుండఁ బనిచి చతురత ననియెన్.

సీ. తగసంస్కృతముఁ దెనుంగుగఁ జేయఁ దెనుఁగు సం,స్కృతముగ జేయంగఁజతురమతివి
   నలు దెఱంగుల వాక్య నవసుధాధారల, ఘనుఁడ వాశువునందుఁ గరము మేటి