ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నందితిమ్మన.

183



మియు నెఱుఁగనిదానివలె వచ్చి అయినదా అభ్యంజన మని పల్కి తనపెనిమిటి తత్తరపడుట చూచి నవ్వుచుఁ గార్యావసరమున శ్రీకృష్ణునంతవాఁడే యాఁడుదాని పాదములు పట్టఁగా యుష్మదాదులన నెంత యనుడు రాయనికిఁ కొంచెము గుండియ కుదుటఁ బడియె. అట్టిభర్తం జూచి తిరుమలదేవి నవ్వుచు "ప్రాణనాథ ! నీవు వగవం బని లేదు. ఇది నీయిష్టానుసారముగ నుండఁదగిన మగువయే. పురుషుల కక్కుఱితిం జూపుటకుఁగా నావలన నీపన్నాగము చేయంబడె నని తెల్పినఁ గృష్ణరాయఁడు నివ్వెఱగంది యిట్టివృత్తాంతములు పూర్వయుగములలోపల జరిగి యుండు ననుటకు సందియ ముండదు. కృష్ణుఁడును నటులనే చేసి యుండె ననుమాట నమ్మఁదగియే యున్నది. అని తెలిపి భార్యచమత్కృతి కెంతయు సంతసించెను.

తిమ్మకవి త్రిస్థలీదండకమును రచించెను. ఈతఁడు లలితకవనమునకుఁ బ్రసిద్ధుఁడు గావున రామలింగ మీతని కవననైపుణిం గూర్చి పల్కుచో, "ముక్కుతిమ్మనార్యు ముద్దుపల్కు," అని చెప్పి యుండెను. ఈ వాక్యమునే మఱియొకకవి యింకొకవిధమున రసపుష్టి చేసి పద్యరూపముగాఁ జెప్పెను. అదెట్లనిన :-

"క. [1] లోకమునం గలకవులకు, నీకవనపుఠీవి యబ్బు నే కూపనట,
      ద్భేకములకు గగనధునీ, శీకరములచెమ్మ నందిసింగయతిమ్మా."

ఈతనిమృదుత్వశయ్య నగుపఱుచుపద్యములఁ గొన్నింటి నీవఱకే మనము వ్రాసి యుంటిమి. ఈపద్యంబున కొకకథ గలదు. దాని నిచ్చో వివరింతము.

ఒకకవి రాజదర్శనార్థము వచ్చి చిరకాలము వేచి యుండి దర్శనము గాకుండుటం జేసి సంస్థానకవి యగునీతిమ్మనం జూడ నిశ్చయించి యాతనికవిత్వవిఖ్యాతియు శక్తియుక్తులును వినియుఁ గనియు నున్నాఁడు గావునఁ బైపద్యము రచియించి యాతనిం గాంచి దానిం జదివెను.

  1. మాకొలఁది జానపదులకు