ఈ పుట ఆమోదించబడ్డది

వేములవాడ భీమకవి

3



యఁగోరితివి; ఆవరము నీకు దయసేయ వచ్చితిని; ఇదె గైకొమ్మని యామెతో నప్పుడే కలసి నీపుత్రునకు నాపేరే యుంచు" మని సెల విచ్చి యంతర్హితుం డయ్యెను.

ఆబ్రాహ్మణి యది యంతయుం జూచి విస్మితయై యొకవిధ మగుకల కావలయును. లేకున్న నీశ్వరుఁ డెక్కడ ? నే నెక్కడ? నన్నుఁ బొందుటయే యాతనికి వలయునా ? అని యూహించి సిగ్గుచేత నీవృత్తాంత మెవ్వరితోడనుఁ జెప్పఁజాల దయ్యెను. ఇట్లుండ నెలతప్పినది. అంతట వేవిళ్ళారంభ మయినవి. దానిం జూచి యాచిన్నది మనంబునఁ గళవళపడసాగినది. అంత మూఁడుమాసంబులు గతించినతోడనే యా చిన్నది గర్భము ధరించినది యని యందఱు ననుమానపడఁదొడఁగిరి. ఇట్లుండ నైదవమాసము సంప్రాప్త మయినది. అప్పటిస్థితిగతుల నాలోచించి యాచిన్నది దోషిణి కావున దీని నిలు వెడలఁ గొట్టినఁ గాని మీయింటికి రా మని యా లేమతండ్రితో నాయిరుగు పొరుగువా రందఱు ననిరి. అపు డాబ్రాహ్మణుఁడు కూఁతుం బిలిచి నిజవృత్తాంతము చెప్పు మనుఁడు నాచిన్నది కన్నీరు నించుచుఁ దా శివునకు మ్రొక్కు విధంబును శివుఁడు తనకు గలలోఁ గన్పించినతెఱంగును నవిస్తరముగాఁ జెప్పిన నాబ్రాహ్మణుఁడు తాను శివపూజాపరుఁడు కావున శివునకు గల్గినమహానుగ్రహమునకు సంతసిల్లి "అమ్మా! నీవు వగవకుము. లోకు లేమనిన ననఁగలరు. నాకు నీవృత్తాంతము సరిపడి యున్న యది" అని యాచిన్న దానిని దగువిధంబునఁ గాపాడుచుండెను. అంత నవమాసములును నిండినవి. అపు డాపె కొకపుత్త్రుఁడు విశేష తేజశ్శాలి జనియించెను. అతని తేజోవిశేషంబులఁ జూచి యాతనికి భీమేశ్వరుం డని నామకరణము చేసెను. ఇదియ వేములవాడభీమకవి జన్మప్రకారము. ఇది యీదేశమున నంతను నట్లే వ్యవహరింపఁబడుచున్నది. ఇఁక నితనిశైశవక్రీడాదికముంగూర్చి యంచుక వ్రాయుదము.

ఈభీమకవి యయిదాఱుసంవత్సరములవఱకుఁ దల్లిపాలనకునై యుండెను. ఇట్లుండి యొకనాఁడు తోడిపిల్లలతో నాటలాఁడ