ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

కవి జీవితములు

క. భారతపరాంశ మని యిం, పారఁగ జెప్పుదురు బుధులు హరివంశము నీ
   వారమ్యకథఁ దెనుంగున, ధీరోత్తమ నిర్వహించి తెలుపుము నాకున్.

అని చెప్పియుండెను. దీనింబట్టి యీకవి అనవేమారెడ్డియాస్థానములో నుండె ననియు, నద్దంకివాసస్థుఁ డనియు, వేమారెడ్డితమ్ముండగుమల్లారెడ్డి మొదట నీతనిని తనకడ నుంచికొని యనంతర మతని యన్న యగువేమారెడ్డి కొప్పించెననియు నా వేమా రెడ్డి ప్రథమములో నీతనివలన రామకథ చెప్పించె ననియును, అనంతర మీభారత శేషమగుహరివంశముం దెనిఁగింపు మని కోఱఁగా దానిం దెనిఁగించినట్లును దేలినది. అట్లుగాఁ బ్రభుఁడు తన్ను గ్రంథరచన కుత్సహింప నెఱ్ఱాప్రెగ్గడ యీక్రింధివిధంబునఁ బ్రభున కుత్తరము చెప్పినట్లుగ నున్నది. ఎట్లన్నను :-

ఉ. నన్నయభట్టతిక్కకవినాథులు చూపినత్రోవ పావనం
   బెన్నఁ బరాశరాత్మజమునీంద్రునివాఙ్మ మాది దేవుఁడౌ
   వెన్ను నివృత్త మీవుఁ గడు వేడుకతో వినునాయకుండ వి
   ట్లన్నియు సంఘటించె మదభీప్సితసిద్ధికి రాజపుంగవా.

క. కావునఁ జెప్పెదఁ గళ్యా, ణావహమహనీయరచన హరివంశము స
   ద్భావమున నవధరింపుము, భూవినుతగుణాభిరామ పోలయవేమా.

అని యున్నది. దీనింబట్టి చూడ నీయెఱ్ఱప్రెగ్గడ తాను నన్నయ తిక్కనలమార్గములనే పోవునట్లుగాఁ జెప్పెను. ఈహరివంశములోఁ దా నావఱకుఁ జేసియున్న గ్రంథ మొక్క రామాయణ మనియే చెప్పి యుండెంగాని రెండవగ్రంథము కానుపింపదు. ఆరామాయణముగూడ వ్యాపకములో నున్నట్లు కానరాదు. కొంతకాలముక్రిందట నొకచిన్న యచ్చుపొత్తములో నుత్తరరామాయణగాథ ద్విపదలో నున్నది చూచి యుంటిని. అది యెఱ్ఱప్రగ్గడనామమున నున్నట్లు జ్ఞాపక మున్నది. అదియును పూర్తిగా నచ్చుపడక యక్షగానగ్రంథముల కుపయోగ మగుభాగమువఱకే అచ్చుపడి యుండుటంబట్టి దానియం దంతశ్రద్ధ చేసి సంపాదించి యుండ లేదు. ఇతఁడు చేసిన రామాయణ మదియే యగునేని యది యంతవిశేషగ్రంథము కాదనియును దానిని నంతయు బ్రకటించు