పుట:Kathalu Gadhalu - Vol3 - Chellapilla Venkata Sastry.pdf/14

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బమ్మెర పోతనామాత్యుడు

(ది 15_11_1939 సం.ర ఆంధ్రపత్రిక నుండి )

“బమ్మెర పోతరాజుఁ గవిపట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్." అని షష్ఠస్కంధారంభంలో సింగయకవీంద్రుఁడు మ్రొక్కిన మ్రొక్కు పద్యం చాలా రసవంతమైన ధోరణిలో వుండడంచేత అందులో నాల్గోచరణాన్నే నేనిక్కడ పుదాహరించి, పోతరాజుకు నమస్కరిస్తూన్నాను. పోతరాజు గారి జీవితసారాంశాన్నంతనీ సింగయ మహాకవి యీ పద్యంలో యిమిడ్చి వున్నాఁడు. అందుచేత తక్కినభాగాన్ని కూడా వుదాహరించిన పిమ్మటే కథాభాగంలోకి వస్తాను.

ఉ. “ ఎమ్మెలు సెప్పనేల ? జగమెన్నఁగఁ బన్నగరాజశాయికిన్
    సొమ్ములుగాఁగ వాక్యములు సూరలుసేసినవాని భ_క్తి లో
    నమ్మినవాని భాగవత నైష్టికుఁడై తగువానిఁ బేర్మితో
    బమ్కెర. . . . . . . . మ్రొక్కెదన్. "

యీ పద్యం వ్రాసినా సింగయ కవీంద్రుఁడు మన పోతరాజుగారికి కొంచె మించుమించుగా సమకాలీనుఁడే అయివుంటాఁడు. యితణ్ణిగురించి అవకాశంవుంటే యీ వ్యాసంలోనే తట్టతుదను వ్రాయవలసివస్తే వస్తుందేమో ? ప్రస్తుతం పోతరాజుగారిని గూర్చి క్లుప్తంగానే కొన్ని మాటలు వ్రాయటానికి సంకల్పించాను.

ఈ పోతరాజుగారం టే కవులలో అందరికీ అపారమైన గౌరవం. ఆ గౌరవం అంతా యింతా అనిచెప్పడానికి అలవి కాదు. భాగవత ప్రతిపాద్యుడైన శ్రీకృష్ణభగవానుణ్ణి పేమించేవారికంటేకూడా పోతరాజుగారిని ప్రేమించేవారే లోకంలో విస్తారంగా వుంటారు. యీయనవిషయంలో నిన్న మొన్న కొందఱు కొన్ని పత్రికలలో యేదో వ్రాస్తూ " బాలరసాల సాల నవపల్లవ....పోషణార్ధమై " ఆనేపద్యం పోతరాజుగారిది కానేకాదనిన్నీ అది మఱివకరిదై వుంటుందనిన్నీ వ్రాశారు. మఱిపకరు ఆపద్యం