ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నార నివృత్తిసంగమ మనే గ్రామములో తీసి బోయీలచేత తాళ్ళు పేడించి కట్టించినాను.

యింతే కాకుండా పనివారసమేతముగా దూరదేశము పొయ్యే వారు దారిలో అస్వస్థపడే పరిజనము ఆటంకపడి నిలవకుండా సాగి రావడానికి దినానికి 3 ఆమడ దూరము నడవగల యొక గుఱ్ఱపు తట్టున నున్ను 4 బోయీలలో నొక తేలికయయిన సామాన్యపు డోలీ నిన్ని కూడా తీసుకొని రావలసినట్టుగా నా యనుభవము నాకు తెలియ చెప్పినది. అదే ప్రకారము తిరుపతిలో రూ.23 కి ఒక గుఱ్ఱపుతట్టువను తీసి కూడా తెచ్చినాను. అందరున్ను ఆరొగ్యముగా నుండే కాలములో తట్టువ మీదనున్ను డోలీలోనున్ను కావలసిన భోజన సామానులను అధికముగా చెయికావలికి వెసుకొని పోవచ్చును.

యింకా నా యనుభవము వలన తెలియవచ్చినది యేమంటే సపరివారముగా దేశము తిరిగేవారు చికిత్స చేసే క్రమము యధోచితముగా తెలిసిన వారిని కూడా పిలుచుకొని తగుపాటి యౌషధములు కూడా తీసుకొని పోవలసినది. ముఖ్యముగా అజీర్తికి జ్వరమునకు వ్రణాలకు గాయములకున్ను ఔషధాలు తీసుకొని పోవలసినది. ఆ ప్రకారముగానే నేను తెచ్చి నా వద్దనుండే ఔషధాలు నా బుద్ధిస్పురణద్వారా నాతో కూడా వచ్చిన వారికె ఇచ్చుచు వచ్చినంతలో భగవత్కటాక్షముచేత నా పరివారానికి వచ్చిన యుపద్రవములు నివారణ మవుచు వచ్చినవి. కూడా వఛ్ఛేవారికి నొక విధమయిన నిర్బయమున్ను తోచి యుండను. శీమమైనపువత్తు లెంత భద్రముగా నుంచినా తునకలుగా పగులు చున్నవి గనుక బంగాళా నాటువత్తులే దారికి యోగ్యము లని తెలుసుకొన్నాను. అణాలు, అర్ధణాలు, పావులాలు చెన్నపట్టణపు దుడ్లు కడప విడచిన వనుక దొరకవు. కూడా తెచ్చియుంటే వెండినాణ్యములు మాత్రము పనికివచ్చుచున్నవి. కృష్ణ కవతలి పయిసాలు కృష్ణ కీవల పనికిరావు. కృష్ణకు నుత్తరమున అణాలున్ను పనికిరావు.