ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రీలు రావచ్చును. అడివిభయము కోడూరితో సరి. అవతల భూమి తెరపగా నున్నది. దగ్గిరదగ్గిర గ్రామాలు, పైరుపొలాలు, జలసమృద్ధిన్ని భాటలో కలిగియున్నవి. అంతటయున్ను చింతచెట్లు గలవు. బాలపల్లె వద్ద కొండవాగు నీళ్ళు నాబోయీలు వగైరాలు తాగినందున నొక బోయిన్ని, ఒకకావటివాడున్ను జ్వరము తగిలి ఖాయిలాపడిరి. గనుక దగ్గిరి నోరంబాడిలో మధ్యాహ్నము నిలిచినాను. పై బాలపల్లెనది వాగువద్ధ శ్రీనివాసమూర్తిపాద మొకటి చేసియున్నది. అక్కడనుంచి పడమటి దేశస్థులు కొండ యెక్కుచున్నారు. ఆదినము 3 ఘంటలకు లేచి 2 గడియల దూరములో నున్న పుల్లంపేట గడియు ప్రొద్దు ఉండగానే చేరినాను. అది పేటస్థలము. ముసాఫరుఖానా యున్నది. బ్రాహ్మణుల యిండ్లు గలవు.

2 తేది రాత్రి 3 ఘంటలకు లేచి 2 ఆమడ దూరములో నున్న నందలూరు చేరినాను. భాట సరాళమే. ఊరివద్ద చెయ్యా రనే నది గడియ దూరము వెడల్పు గలిగియున్నది. నదికి నిరుపక్కల గుళ్ళున్నవి. అది పుణ్యక్షేత్రము. పరశురాముని మాతృహత్య నినర్తించిన స్థలము. అక్కడికి 2 ఘడియల దూరమందు అత్తిరాల యనే మహాస్థలము అగ్రహారసహితముగా నున్నది. ఊరు తురకలతో నుండియున్నది. మొసాఫరుఖానాకలదు. పేటస్థలము, సకల వస్తువులు దొరుకుని. బ్రాంహ్మణుల యిండ్లు వసతిగా నున్నవి. ఆదిన మంతయు అక్కడనే యుంటిని.

3 తేది రాత్రి 2 ఘంటలకు లేచి 9 ఘంటలకు 2 ఆమడ దూరములో నున్న భాకరాపేట చేరినాను. దోవమంచి దయినను రాతిగొట్టు. కొండపక్కను భాట పోవుచున్నది. పొడిచెట్లు అడివి, దోవలో వొంటిమిట్ట యనే గ్రామమున్నది. అక్కడ నాల్గు పక్కల కొండలే కట్టగా గల్గిన యొక్క భారీ చెరువున్నది. చెరువు కట్టమీద భాట. ఆ వొంటిమిట్టలో చూడ వేడుకలయిన గుళ్ళున్నవి. ముసాపరుఖానా యున్నది. బస్తీ గ్రామము. ఆ భాకారాపేట పేటస్థలము. అన్ని వస్తువులు దొరుకుని. అంతటా రాళ్ళున్నవి. వసతి యయిన