పుట:Kasiyatracharitr020670mbp.pdf/409

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెరువు కట్టివున్నది. పడమటిపక్క లుంగంబాక చెరువు కట్టియున్నది. వుత్తరపక్క ప్రతి తోటలలో తటాకాలు, దొరువులు తొవ్వివున్నారు. అందులో జగదీశ్వరుని కటాక్షముచేత మంచినీళ్ళు కలిగివున్నవి. సమస్త ద్వీపాంతరాల పదార్ధాలు కలవు. పనివాండ్లసహా అమితముగా కలరు. అయితే జనసమ్మర్దముచేత భూమి ఆరోగ్యమయినది కాదు. వుష్ణవయువు భూమి. సంకలిత రోగాలు ప్రాప్తిస్తూ వస్తున్నవి. కాల నియమాలు లేకుండా కాయగూరలు, ఫలాదులు, పుష్పాదులు అమితముగా దొరుకుచున్నవి.

యిక్కడివారి ప్రకృతులు ఉపాయవేత్తలుగాని సాహసులుగారు. ద్రావిడాంధ్రకర్ణాటక దేశాలమధ్యే యీ ప్రదేశము వుండుటచేత బాల్యాదారభ్య దేశ్యములయిన ఆ మూడు భాషలున్ను ముందు దొరతనముచేసినవారి తురకభాష, యిప్పుడు దొరతనము చేసే యింగిలీషువారి భాషయున్నూ నోటనానడముచేతనున్ను, పదార్ధములుగా కొన్ని సంసృతవాక్యాలు అభ్యసించుటచేతనున్ను యిక్కడివారి వుచ్చారణ స్ఫుటముగా వుంటూ వచ్చుచున్నది. యిక్కడి స్త్రీలు గర్విష్టులుగానున్ను, పురుషుల పట్ల నిండా చొరవచేసుకొగలవారుగానున్ను అగుపడుతారు. అయితే వస్త్ర్రాభరణప్రియులే గాని నైజగుణమయిన సాహసము నిండా కలవారుగా తోచలేదు.

యిక్కడి భూమి సారవత్తు కాకపోయినా లోకులు చేసే కృషివల్ల ఫలకారిగా వున్నది. వృక్షాదులు పుష్టికలవి కాకపోయినప్పటికిన్ని యిక్కడ సమస్తదేశపు వృక్షాదులున్ను కలవు. సమస్తజారుల పుష్పాదులు చూడవచ్చును. యిక్కడివారు చాలా మూర వెడల్పుకలబట్టలు కట్టుతారు. యధోచితము యిక్కడివారు కర్మకులుగానున్ను, దేవబ్రాహ్మణ విశ్వాసము కలవారుగానున్ను వుంటారు. యిక్కడి హిందువులకు పూర్వపు పురోవృద్ధి లేకపోయినప్పటికిన్ని ముందర చెందిన వాసనను ప్రయాసమీద కాపాడుకుంటూ వస్తారు. జాతులవారి జనబాహుళ్యము వారి విభవముతో స్త్రీ పురుష సల్లాపాలు చూడ