పుట:Kasiyatracharitr020670mbp.pdf/192

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వూరినుంచి గంగ దాటేటప్పుడు ప్రవాహము తీసి వుండేయిట్టి కాలాలలో నడమ మిట్ట పెట్టి వుంటున్నది గనుక నడమ పడవ దిగి మిట్టకవతల మళ్ళి పడవయెక్కి ప్రయాగలో దిగవలసినది. రెండుమాట్లు యెక్కి దిగే ప్రయాస లేకుండా యీవూరినుంచే యమునానదిలో నా పడవలు పొయ్యేటట్టు చేసి ఒకసారిగానే ప్రయాగలో పెరిమిట్టు ఘాటులో దిగినాను. యిక్కడ మనిషి 1కి పయిసా వంతున ఘాటుసుంకము పడవదాటడానికి యియ్యవలసినది. యీ ఘాటుసుంకము సాలుకు 23000 రూపాయిలు లెక్క యిజారాకు యిచ్చివున్నారు. 2.3 ఘంటలకు త్రివేణి దర్శనముచేసి స్నానక్షౌరాదులు చేసుకోవడమయినది.

యీ ప్రయాగ మాహత్మ్యమేమంటే జగత్సృష్టికి ముందు పరమాత్ముడు బాలరూపాన్నిధరించి యీ స్థళమందున్న అక్షయవటపర్ణముమీదవసించి వుండినాడు. యీ మూలవటము యెన్నటికి క్షయమును పొందనిది గనుక అక్షయవట మనే నామము గలిగినది. ఈ అక్షయవటమే బ్రహ్మస్వరూపమని పురాణసిద్దము. పిమ్మట జగత్సృష్టి అయన వెనకకూడా ఈ అక్షయవటము సువర్ణమయమై బహుకాలము శోభిస్తూ వుండినది. మాధవమూర్తి కూడా యీ వటవృక్షాన్ని అనుసరించి యిక్కడ విరాజమానుడయి వున్నందున యీ స్థళము బహు పుణ్యస్థల మయినది. తద్వారా యీ పుణ్యస్థలములోచేశే సుకర్మాలు అక్షయ ఫలప్రదము లౌననే తాత్పర్యముతో పూర్వము బ్రహ్మ యిక్కడ దశాశ్వమేధఘట్ట మని ప్రసిద్ధి పడి వున్నది. ఈ దశాశ్వమేధాలు చేసినంతలో మాధవమూర్తి బ్రహ్మకు ప్రసన్నుడయి యిచ్చయించిన వరమిస్తానని వాగ్దత్తము చేసినాడు. గనుక బ్రహ్మ యీ మహాస్థలము విష్ను క్షేత్రమని యిదివరకు ప్రసిద్దమై యున్నది కదా; యికమీద నావేరుకూడా యీ స్థళానికి సంబంధించి వుండేటట్టు చేయవలెనని ప్రార్ధించినాడు. మాధవమూర్తి అదేప్రకారము కటాక్షించి యికను లోకులు యీ క్షేత్రాన్ని విష్ణు ప్రజాపతి క్షేత్రమని వాడుకుందురు గాక అని నియమించినాడు. అది మొదలుగా యీ స్థళాన్ని విష్ణుప్రజాపతి క్షేత్రమని వాడుకుంటున్నారు.