పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/60

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెట్టినప్పుడు అంతకన్న గతియేమి? ఎట్లో వుడికీవుడకని మెతుకులు దిని గాలికి చాటుగా బండి సర్జించుకొని దానిమీద నిద్రించడం, బండివాడు బండిక్రింద పరుండడం ఇట్లా ప్రయాణం సాగిస్తూ గంజాం చేరాము. అక్కడి నుండి సత్రాలలో భోజనం దొరకడం మొదలు వంటబాధ తప్పింది. గంజాం రాత్రిపూట ప్రవేశించాము. సత్రంలో తిని పరున్న తరువాత నాకు అపారంగా చెవిపోటు మొదలుపెట్టింది. అక్కడ దిక్కెవ్వరు? దగ్గఱ తమలపాకులు సున్నము నిల్వ వున్నది. అవి రెండూ కల్పిన రసం వల్ల ఆ బాధ నివర్తించింది. తాంబూలము కాశీయాత్ర చేయించడానికే కాకుండా చెవిపోటు వైద్యానిక్కూడా పనికివచ్చిందని నాలో నేననుకొన్నాను. అటునుండి తెలుగుదేశమే అనుకోదగిన సీతారాంపురం మొదలైన గ్రామాలద్వారా దేశానికి వస్తూ బర్హంపురంలో (బరంపురం) మాత్రం వారం రోజులు ఆగినాము. కారణం నాతో వచ్చిన కోమటన్నాడుకదా, ఇక నా చేతిలో సొమ్ములేదు. ఈ పైన మనము కాలినడకమీదనే వెళ్లాలన్నాడు. అలాగయితే ఈ వూళ్ళో నేను అవధానం చేసి సంపాదిస్తానని చెప్పి ఆగమన్నాను. ఆగేడు. అవధానమున కంతా ప్లీడర్లు సిద్ధం చేశారు. కాని అంతలో వారిలో నెవరికో ఆపత్తు వచ్చి మఱికొన్నాళ్లుండవలసి వచ్చింది. కోమటికి ఇంటికెప్పుడు వెడదామా అన్నంత తొందరగా వున్నది. అందుచేత, అతడు, మీరుండండి నేను వెడతానన్నాడు. దానిమీద, నీకుమాత్రం బండి ఖర్చెక్కడిది? మన యిద్దరికీ కూడా సరిపడ్డ సొమ్ము ఇక్కడ వస్తుంది వుండమన్నాను. తగిన ప్రత్యుత్తరం లేక ఆగినాడు కాని, ఏమైనా వాని మనస్సిక్కడ