పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/36

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తయారు చేశాడు. అప్పటికి నేనింకా రఘువంశం మొదలుపెట్టలేదు. ఆ కాలంలో వీధినాటకాలకే లోకంలో యొక్కువ ప్రచారం వున్నది. కంపెనీలింకా రాలేదు. నీలపల్లె సీతారామస్వామివారి గుడియెదుట మా నాటకం మొట్టమొదట ప్రదర్శనం జరగడానికి సర్వసంసిద్ధం అయింది కాని, మా తండ్రిగారి భయంచేత తుదకు నేను అంతా వర్లించిన్నీ వెనుదీయడంచేత యావత్తు ఆగిపోయింది. ఏవియెట్లయినా, ఆయినా సందర్భాలు నన్ను అంతో యింతో కూనిరాగం తీసేవాణ్ణిగా చేయగలిగాయని నేననుకొంటాను. కంపెనీ నాటకాలు వచ్చిన తరువాత, వీరేశలింగం గారి శాకుంతలం ప్రదర్శించడానికి యానాంలో కొందరు ప్రముఖులు చాలా ప్రయత్నించి దీనిలో వేంకటాచలం కూడా వుంటే బాగుంటుందని అనుకొని నాకు కబురు చేశారు. అప్పటికి నేను సామర్లకోటలో మాధుకరం యెత్తుకుంటూ లఘుకౌముదిన్నీ భారవిన్నీ' చదువుచున్నాను. అప్పటికి నాపేరు వేంకటాచలమే. ఇంకా నేను బ్రహ్మయ్య శాస్రుల వారి సన్నిధికి చేరలేదు. చేరిన పిమ్మటనే నాకు శ్రీ శాస్రులవారు వేంకటశాస్త్రి అని శాస్త్రి బిరుదమును దయచేశారు. వారుమాత్రం అప్పుడప్పుడు వేంకటాచలం అని కూడా పిల్చుచుండుట కలదు. కాని యేమైనా వారి నామకరణం చేసింది మొదలు వేంకటాచలం పేరు వెనుకబడి శాస్త్రి పేరే వాడుకలోకి వచ్చింది. ఆ శాకుంతల నాటకంలో నేను కణ్వుడను. యావత్తున్నూ సిద్ధమయినది, పెద్దపాక వేశారు. ఆ యానాము ఫ్రెంచి గ్రామమగుటచే రిపబ్లికు ఆచారమును బట్టి మాలమాదిగలకు కూడ పబ్లికు సందర్భములలో అవకాశమియ్యక తీరదు. అట్లి