ఈ పుట ఆమోదించబడ్డది

66

కాదంబరి

రత్వము వహించియున్నదో లేదో నిదానింపుము అని మఱియుంబెక్కుతెరంగులఁ దత్కాలోచితముగా నర్మసంభాషణములఁ గావింపుచుఁ గ్రమంబునఁ దత్ప్రదేశమునుఁ జేరితిమి.

అట్టిసమయమున నాసరోవరము పశ్చిమతీరంబున దవ్వగుటచే ననతివ్యక్తముగాఁ పురుష రోదనధ్వని యొకటి వినంబడినది. కుడికన్నదరినది మొదలు శంకించుచున్న నాహృదయమాధ్వని వినినంత మిక్కిలి తొట్రుపడుచుండ, తరళికా? యిదియేమని వెరపుతోఁ బలుకుచు మేను గంపమునొంద నతిత్వరితముగా దదభిముఖముగాఁ బోయితిమి.

ఆ సమయము నిశ్శబ్దముగా నుండుటచే దూరమయినను మఱియు నాధ్వని యిట్లు విననయ్యె.

హా పుండరీక! హా ప్రాణమిత్ర! హా! మహాభాగ! మన్మధ హతకుఁడు నీ కెట్టి యుపద్రవము సంఘటించెనురా! అన్నన్నా! దుర్వినీతయగు మహాశ్వేత మూలముననేకదా? యింతపుట్టినది. కటకటా! శ్వేతకేతున కెంతవచ్చినది? ధమ౯మా! నిన్నిఁకఁ నివ్వరు స్వీకరింతురు? తపంబా! ఇఁక నీకాశ్రయమెవ్వరు? సరస్వతీ! విధవవైతివే? సత్యమా! నిన్ననాధఁగాఁదలంచెదను. మీయాశ్రఁయుండన్యలోకమునకుఁ బోయె. అయ్యో మిత్రమా? నన్నుఁజూడవేమి? నిన్ను విడిచి యొకనిమిషమయిన నుండఁగలనా? నన్ను విడిచిపోవుట నీకు న్యాయమా? యొక్కసారి మాట్లాడుము నాకుమిక్కిలి వేడుకగానున్నది. ఇఁక నేనెక్కడికిఁ బోవుదును, ఎవ్వరితో దిరుగుదును? నాయందుగలసుహృత్స్నేహ మంతయు నెందుబోయినది? ఎప్పుడును నవ్వుచునే మాట్లాడు వాఁడవే, ఆప్రజ్ఞయంతయు నెందుబోయినది! అయ్యయ్యో. అక్కటా! హా! హా! అనియీరీతి గపింజలుఁడు విలపించు చున్నట్లు వినంబడినది.