ఈ పుట ఆమోదించబడ్డది

50

కాదంబరి


కాని యట్టియవస్థ నేనెన్నఁడు నెఱుంగను.

అట్లు పెద్దతడవుచూచి యెట్ట కేలకుఁ జిత్తమును దృఢపరచుకొంటి. అప్పు డతని హృదయమున నిల్చుట కవకాశమిచ్చుటకుఁ గాబోలు నిశ్వాసమారుతములు బయలువెడలినవి. హృదయాభిలాష దెలుపుచున్నదివోలె గుచయగళము గగుర్పొడిచినది. సిబ్బితిం గరుగుచున్నట్లు మేనెల్ల జమ్మటలు గ్రమ్మినవి. మదనశరపాతభయంబునఁ బోలె గంపము వొడమినది. అట్టిసమయమున మనంబున నే నిట్లుతలంచితిని.

అయ్యయ్యో! సురతవ్యతిరేక స్వభావుండును మహానుభావుండు నగు నిమ్మునికుమారునియందు దుర్మదుండగు మన్మధుండు నా కిట్టి యనురాగము గలుగఁజేయుచున్నవాఁడేమి? అనురాగము విషయయోగ్యత్వమును విచారింపదు, స్త్రీహృదయంబెంతమూఢ మైనదోకదా! పాకృతజనులచేఁ బొగడఁబడుచుండెడు మన్మధవిలాసము లెక్కడ? తపోమహత్వ మెక్కడ? మన్మధవికారములచేఁ దొట్రుపడుచున్న నన్నుఁజూచి యీతండు చిత్తంబున నెట్లు తలంచునో? అట్లెఱింగియు నీ వికారమణగింప లేకున్నదాన నెంతచిత్రమో? ఇది మదీయచిత్తదోషముకాదు. తదీయరూపవిశేషమం దిట్టి మహిమ యున్నది. ఈతఁడు నా వికారములఁ జూడకమున్నందుండిలేచి పోవుట యుక్తము. అప్రియములగు స్మరవికారములఁ జూచి కోపముతో శాపమిచ్చునేమో? మునిస్వభావము పరిభవమును సహింపదుగదా.

అని మరలిపోవుటకు నిశ్చయించియు నతని యాకృతివిశేషము పదములకు నిగళమైతగులుకొని కదలనీయమిం జేసి మునిజాతి యశేష జనపూజనీయమయినదికదా! నమస్కరించి యఱిగెద, దీనం దప్పేమి యని యప్పుడు దాపునకుఁబోయి అతనిమొగమునందు చూపులిడుచు బాదంబులకు నమస్కరించితిని.