ఈ పుట ఆమోదించబడ్డది

రశ్మిమంతునికిఁ బుండరీకుఁడనియు, సోమప్రభునకుఁ జంద్రాపీడుఁడు, మనోరథ ప్రభకు మహాశ్వేత, మకరందికకుఁ గాదంబరి, యనియుఁ బేరులుమాత్రము మార్చి వ్రాసెను. ఇట్టి ఫ్రౌఢకవి ప్రత్యేకము తానొక కథను గల్పించి వ్రాయక యొకరు వ్రాసినకథనే తీసికొని రచించుటకుఁ గారణము మృగ్యమైయున్నది. కథ అదియేయైనను పాత్రోచితమైన సంబాషణములు స్వభావవర్ణనలు శయ్యా రీతి పాకాదు లిట్టివి మరియొక గ్రంథమునఁ గనంబడవు. దేనివర్ణించినను నెదురఁబెట్టి కన్నులకుం జూపునట్లు స్వభావోక్తిగాఁ దెలియఁజేయును. ఈగ్రంథము రచించుటచేతనే 'బాణోచ్చిష్ఠం జగత్సర్వం' అను వాడుక వచ్చినది.

ఇందుఁ గాదంబరీ మహాశ్వేతలను గంధర్వ రాజపుత్రికల చారిత్రము విప్రలంభశృంగారరసపూరితముగా వర్ణింపఁబడియున్నది. గ్రంథమంతయుఁ జదివినఁగాని యిందలి కథాచమత్కారము తెలియంబడదు. దీని సమముగాఁ దెలిగించినచోఁ జదువరులకు సులభగ్రాహ్యముగాదని విశేషవర్ణనల వదలి కథమాత్రమే వ్రాసితిని.

కథాసంగ్రహము.

దేవలోకములో శ్వేతకేతుఁడను మహార్షి ఆకాశగంగలో దేవతార్చనకుఁ బద్మములు గోయుచుండఁగాఁ బద్మసన్నిహితయైన లక్ష్మి కతనిఁజూచినతోడనే చిత్తచాంచల్య మైనందున సద్యోగర్భంబునఁ బుండరీకుఁడను కుమారుఁ డుదయించెను. సుందరరూపుఁడగు నతఁ డొకనాఁడు కపింజలుఁడను మునికుమారునితోఁగూడ నచ్ఛోద సరస్సునకు స్నానమునకై యరిగెను. అక్కడికే తల్లితోఁగూడ స్నానమునకై వచ్చిన మహాశ్వేత యనుగంధర్వకన్యక పుండరీకునిమోహించి యతని మరులుకొలిపి భావమువ్యక్తపరచియు మాటాడక తల్లితో నింటికిఁబోయినది.