ఈ పుట ఆమోదించబడ్డది

20

కాదంబరి

నది మెల్లన నాభూవల్లభుని కిట్లనియె. దేవా! దేవర దేవిగారివిషయమై కొఱఁత యేమియుఁ జేసియుండలేదు. వినుండు. నాకీమహారాజుతో సమాగమము విఫలమైనది గదా యని యమ్మగారు చింతించు చుండఁగనే చాలకాలముగగతించినది. శయనాసనస్నానభోజనభూషణ పరిగ్రహాదులగు దివసవ్యాపారములఁ బరిజనప్రోత్సాహంబున నెట్ట కే కష్టంబునఁ గావింపుచుండునది. అట్టి వికార మెన్నఁడును హృదయ పీడాజిహీర్షచేఁ దెలియనిచ్చినదికాదు. నేఁడు శివరాత్రి యను మహాకాళనాధు నారాధింప దేవళమున కఱిగినది. అందొకచో మహాభారతము జదువుచుండఁ గొండొకసేపు కూర్చుండి యాలకించినది. అందు సుతులు లేనివారికి గతులు లేవనియుఁ బున్నామ నరకము బుత్రులు గాని తప్పింపలేరనియు లోనగు వృత్తాంతముల విని యింటికి వచ్చినది మొదలావిషయమే ధ్యానించుచు మే మెంత బ్రతిమాలినను గుడువక కట్టక ప్రత్యుత్తర మీయక యిట్లు దుఃఖించుచున్నది. ఇది యే యీమె శోకకారణమని పలికి మకరిక యూరకొన్నది.

ఆ కథవిని యొడయం డొక్కింతతడవు ధ్యానించి వేడినిట్టూర్పు నిగుడింపుచు నిట్లనియె. దేవీ! యూరడిల్లుము. దైవాయత్తమగు కార్యమునుగురించి మన మేమిచేయగలము. దేవతలకు మనయెడఁ గనికరములేకపోయినది. వెనుకటిజన్మమున మంచికర్మ చేసితిమికాము. ఇటుపిమ్మట మనుష్యులకు శక్యమైన పనులెల్లఁ గావింతముగాక. గురుభక్తి నిబ్బడిగాఁజేయుము. దేవపూజలు విశేషముగాఁ గావింపుము. మునిజనసపర్యల నాదరముతోఁ జేయుము. వారు దుర్లభములైన వరముల నీయఁగలరు. చండకౌశిక ప్రసాదంబున బృహద్రధుండు జరాసంధుండను పుత్రుం బడయలేదా? దశరధుండు వృద్ధుండయ్యు విభండకనందను నారాధాంచియే కాదా! రామలక్ష్మణభరత శత్రుఘ్నులను పుత్రులం గాంచెను. మునిజనసేవ యెన్నఁడును