ఈ పుట ఆమోదించబడ్డది

కపింజలుని కథ

గంధర్వరాజపుత్రీ! వినుము నీవట్లు శోకసాగరంబున మునిఁగి యుండ గగనవాణి ననుసరించి నే నెగిరితినికదా! అతండు నాకుఁ బ్రత్యుత్తర మియ్యకయే యాకాశమార్గంబునఁ బోయిపోయి క్రమంబునఁ జంద్రలోకమునకఱిగి యందు మహోదయంబను పేరుగల సభయం దొప్పుచున్న పర్యంకంబున నాపుండరీకశరీరమున పడవైచి నా కిట్లనియె.

కపింజలా! నన్నుఁ జంద్రునిగాఁ దెలిసికొనుము. నేను జగదుప కారమునకై యుదయించి ప్రకాశింపుచుండ నీప్రియమిత్రుఁడు పుండరీకుఁడు కామాపరాధంబున శరీరమును విడుచుచు నన్నుఁజూచి యిందు హతకా! నీకతంబున నేను ప్రియాసమాగసుఖం బనుభవింపకయే ప్రాణముల విడుచుచున్నవాఁడ గావున నీవు సైత మిట్లే కర్మభూమియైన భారతవర్షంబునం జనియించుచు జన్మజన్మకు ననురాగముగలిగి ప్రియాసమాగసుఖం బనుభవింపక తీవ్రమైన విరహవేదన ననుభవించి మృతినొందఁగలవని శపించెను.

అప్పుడు నేను అయ్యో! అపరాధమేమియు లేకయే నన్నిట్లు శపించితివేలనని కోపాగ్ని ప్రజ్వరిల్ల నతనిం జూచుచు నాయట్టికష్టముల నీవుగూడ ననుభవించుమని క్రమ్మర శపించితిని.

అంతలోఁ గోపమడఁచుకొని వివేకబుద్ధిచే విమర్శింపుచు మహాశ్వేత మత్కిరణసంజాతమగు నప్సరఃకులంబునఁ బుట్టిన గౌరివలన జనియించినది. దానంజేసి నాకాప్తురాలుగదా! అమ్మహాశ్వేతచే వరింపఁబడిన నిమ్మునికుమారుఁడుసైతము బందువుడేఁయగు. నిష్కారణము శపించితినే కానిమ్ము. జన్మజన్మకు నని పలుకుటచే రెండుజన్మము లెత్తినంజాలు నాతోఁగూడ నితండు మత్త్యలోకంబున రెండుసారులు జనియించునని తలంచుచు శాపదోష మంటక నిట్లనియె.