ఈ పుట ఆమోదించబడ్డది

130

కాదంబరి


దైవానుగ్రహము గలిగిన వాఁడెరాగలఁడు. లేక మఱియెవ్వనేని బంపుదురు. కాకయని పలికినవిని విలాసవతి యిట్లనియె. సఖీ! మన యిరువురకు వారిరువురయందును సమాన ప్రేమగలిగి యున్నది. వానిం జూడక నేనుమాత్రము సైరింపగలనా! వారింపఁకుము మనము వారించినను జంద్రాపీడుఁడు నిలుచువాఁడుకాడు. యనుజ్ఞ యిమ్మని పలికిన నక్కలికియు నెట్టకేలకు సమ్మతించినది.

అంతలో సాయంకాలమగుటయుఁ జంద్రాపీడుఁడు ఆ రాత్రి భోజనముచేసి తల్పంబున శయనించి సంకల్పశతములచే మనోరధములఁ బూరించుకొనుచు నిట్లు తలంచెను.

నేను ముందుగా నచ్ఛోద సరస్సునకుఁబోయి యందు వెనుక వెనుకగా నరిగి వైశంపాయనుని కంఠగ్రహణముచేసి నీవి కెందు బోవఁ గలవని పలికిన నతండు నామాట ద్రోయనేరక నాతో వచ్చునుగదా. పిమ్మట మహాశ్వేత యాశ్రమమున కరిగి యందుఁ బరిజనము నునిచి యామెతోఁ గూడ హేమకూటమునకుఁ బోయెదను.

అందు నన్నుంజూచి కాదంబరి పరిజనము తొందరగా నిటునటు తిరుగుచు నమస్కరింపుచుండఁ గ్రమంబునఁ గాదంబరి యున్న తావరసి యరిగిన నత్తరుణియు నా రాక సఖులచే నెఱింగి తటాలునఁ బుష్ప శయ్యనుండి లేచి యత్యాతురముతో స్వాంగాలంకారముల సవరించు కొనుచు సిగ్గుచేఁ దలవంచుకొని శయ్యాసమీపంబున నిలువంబడియున్న యన్నారీలలామమునుగాంచి కన్నులకలిమి సార్ధకము గావించెదను కదా.

తరువాత మదలేఖను పత్రలేఖను గేయూరకుని యధోచిత గౌరవంబున మన్నించుచు సాహసముతో వివాహప్రయత్నము చేయుటకు జిత్రరధునకు వార్త నంపెదను.