ఈ పుట ఆమోదించబడ్డది

13]

కాదంబరి కథ

97


నేమియు మాటాడఁజాలకున్నవాఁడు. ఇతని వృత్తాంతమేమియుం దెలియక రాజచక్రము తొట్రుపడుచుండును. దూరమందున్నను బద్మినీపద్మబాంథవులకుఁ బోలె బ్రళయపర్యంతము మీయిరువురకు నీప్రీతి స్థిరమై యుండకమానదు. ఈకుమారున కరుగుట కనుజ్ఞ యిమ్మని పలికిన విని కాదంబరి నెచ్చలీ! పరిజనయుక్తముగా నీజన మీకుమారునకు తనయంతరాత్మవలెనే స్వాధీనమైయుండ నిందుల కనురోధ మేమి? అట్లే పోవచ్చునని పలుకుచు గంధర్వకుమారులం జీరి వీరి స్కంథావారమును జేర్పుఁడని యాజ్ఞాపించినది.

అప్పుడు చంద్రాపీడుఁడు లేచి తొలుత మహాశ్వేతకు నమస్కరించి తరువాతఁ గాదంబరికి మ్రొక్కి ప్రేమపూరితమగు తదీయ దృష్టిచేతను, మనసు చేతను గ్రహింపఁబడుచు దేవీ! ఏమందును? లోకమున బహుభాషకులనాదరింపరుగదా? నన్నుఁ బరిజనకథల యందు స్మరింపుచుండ వలయు నిదియే నాకోరిక యని పలికి యతండ య్యంతఃపురమునుండి బయలుదేరెను.

అప్పుడు కాదంబరితక్క తక్కిన యంతఃపురకాంత లందఱు తద్గుణగౌరవముచే నాకషి౯ంపఁబడి పరవశలై బహిర్ద్వారమువఱకు నతని ననుగమించి యరిగిరి. అందరివలనను నామంత్రణము వడసి యతండు కేయూరకానీతమగు నింద్రాయుధ మెక్కి గంధర్వకుమారులతోఁ గూడికొని నడుచుచున్న యతనికి హృదయమందే కాక యన్నికడలను గాదంబరి యున్నట్లు కనంబడుచుండెను. అతనిమనంబు తన్మయంబగుటఁ బోవలదని వెనుకనుండి లాగుచున్నట్లును ముం దడ్డము వచ్చినట్లును దోచుచుండెను. అట్టి విరహముతో నతండు క్రమంబున మహాశ్వేతాశ్రమము మీదుగా నచ్ఛోదసర స్త్సీరమున కరిగి యందుండి యింద్రాయుధ ఖురపుబానుసారముగా స్కంధావారమును జేరి గంధర్వకుమారుల నంపివేసెను.