ఈ పుట ఆమోదించబడ్డది

ఉ. చేసితి నీకృపారసవిశేషమునం గడు సారసత్కథా
    భాసురముల్ ప్రబంధములు భవ్యవచోరచనా చమత్కృతిం
    జేసి ననుం జనుల్ బొగడఁజేసితి నమ్మ భవత్పదాబ్జ సే
    వా సుసమాహితాత్ము లిల వాసితకీర్తులు గారె మాతృకా !

శా. భవ్యాలంకరణోరు భావమృదుల వ్యంగార్ధ సంయుక్తమై
     దీవ్యద్బాణకవి ప్రణీతమయి సందీపించు కాదంబరీ
     కావ్యంబర్ధముసేయఁ బండితులకుం గాదన్న చో నాకహా ?
     సువ్యక్తంబుగఁ దెల్గు సేయనగునే సూరుల్ విచారింపరే !

చ. గనిఁ గని సాధ్యరత్నములఁ గైకొనువాని విధంబునన్ ఫలిం
    చిన మహిజంబుజేరి తనచేతుల కందినపండ్లఁ గోయు న
    ట్లనుపమ శబ్ద వారినిధియై తగు దీన స్ఫురించి నంత గై
    కొని తెలిగించితిన్ సదనుకూలకథాగతి దప్పకుండఁగన్.

చ. మృదుపద వాక్యవైభవ సమేతమునై సదలంకృతి ప్రభా
    స్పదమగుచున్ శుభధ్వనుల భాసిలి కోమలభావ దీప్తమై
    పొదలెడు నీకథారచన పూతగతిన్ సుజనాళికర్థ సం
    పద పొలుపొంద మారమణి మాట్కి ముదం బొనరింపకుం డునే.