పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/346

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఘోటకముఖునికథ.

335

నే నీయిల్లువిడువక యిందే కాలక్షేపముసేయుచుంటిని. నాపేరు రాధ యండ్రు. నాపుత్రికపేరు మిత్రవింద. నే నాబాలికను బ్రాణముపోలికఁ జూచుకొనుచు హృదయంబునం బెట్టుకొని కాపాడుచుంటిని. నాకూన మిక్కిలి చక్కనిది. దినదినప్రవర్ధమాన యగుచుఁ బండ్రెండేఁడులప్రాయము వచ్చునప్పటికి మిక్కిలి లావణ్యముగలిగి ప్రకాశింపఁజొచ్చినది.

నాపుత్రికకు యౌవనాంకూరమైనది మొదలు తగినభర్త యెవ్వఁడు దొరకునని యాలోచించుచుంటిని. దైవమే యన్నియుం గూర్చును. కూడినవానిం జెఱచుచుండును. వరాహద్వీపాధిపతి బ్రాహ్మణప్రభువు వేటకై యొక నాఁ డీయడవికి వచ్చెను. గొప్పగాలివాన పట్టినది. బలములన్నియుఁ దలయొకదెసకుఁ జెదరిపోయినవి. ఇంతలోఁ జీకటిపడినది. మెఱపులు మెఱయుచుండెను. ఆవెలుఁగునఁ దడిమికొనుచు నెట్లో యాఱేఁడు మాకుటీరమున కరుదెంచి యెవరయ్యా ! లోపలనని యఱచెను. నా కింకను నిద్రపట్టలేదు. నేను బోయి తలుపుతీసితిని. కట్టిన గుడ్డలన్నియుఁ దడిసినవి. వజవజ వణఁకుచుండెను.

నన్నుఁజూచి యతండు ఆమ్మా ! యీరాత్రి మీయింట వసించి చలిఁ బాపుకొనియెదఁ గొంచెము తావిచ్చెదవా ? అని యడిగెను. రండు రండు నిశ్శంకముగా వసింపుఁడు. అని పలుకుచు నాయొడయని లోనికిఁ దీసికొనిపోయి కట్టుకొనుటకుఁ బొడిగుడ్డలిచ్చి కాచుకొన నిప్పురాజ వైచి వేడినీళ్లు పెట్టి వంటఁజేసి పాలు పెరుఁగు మీగడతోఁ దృప్తిగా భోజనము పెట్టితిని. పండుకొన మంచ మిచ్చితిని.

ఆనృపతి యప్పుడపరిమిత సంతోషము చెందుచు నవ్వా ! నేఁడు నీవు నాకు మంచియుపకారము గావించితివి. ఆజన్మాంతము నిన్ను మఱువను. నీ వొంటిగా నీయరణ్యమధ్యమున నుండనేమిటికి ? నీకుఁ బిల్ల లెందఱు ? నీయుదంత మెఱిగించి నాకు శ్రోత్రానందము గావింపుమని యడిగిన నే నిట్లంటిని