పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/17

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

నల్లనల్లన నెగఁబ్రాకుచుండెను. ఆ తేజము దాపున నున్నట్లేయుండి యెంతసేపు నడచినను నట్లే కనంబడుచుండును. ఆకటికి చీకటిలో ధైర్యమే సహాయముగా నతండా దీపమువెలుఁగు ననుసరించి క్రమోన్నతంబగు నన్నగం బెగ ప్రాఁకిప్రాఁకి పెద్దతడవునకుఁ దన్నికటంబుఁ జేరెను. సాంద్రశిలాఘటిత కుట్టిమంబగు సమతలంబుచేరి యతండు దానువచ్చిన దేసంబరికించుచు ఝల్లరీధ్వానభీకరంబగు నంధకారంబు గాక యొండుగానక గుండెపైఁ జేయివైచుకొనుచు అన్నన్నా ! తేజో లక్ష్యంబునంగానక యీకటికిచీఁకటిలో నీప్రదేశంబుఁజేర శక్యమా ? దైవమే నన్నిందుఁజేర్చెను. ఇందలి ప్రసూనముల వాసన లపూర్వ నాసాపర్వము గావించుచున్నవి. మండలాధిపతి యెవ్వండైనఁ గ్రీడా శైలముగాఁ జేసికొని యిందు విహరించుచున్నవాడా? ఔను. సందియములేదు. అది విద్యుద్దీపప్రభ. గుహాంతరమున నమర్పఁబడియున్నను గవాటదర్పణంబునం బ్రతిఫలించి దీప్తి జాలంబు పైకి విరజమ్ము చున్నది.

ఇందు మహారాజులో దేవతలో వసియించియుండిరి. గుహా మందిర కవాటంబులు తెఱవఁబడియున్నవి. లోనికింబోయి వింతలం జూచెదంగాక యని తలంచుచు మెల్లమెల్లన నడుగులిడుచుఁ బొంచి పొంచి చూచుచు నాగుహలోనికిఁ బదిబారలు పోయెను. ప్రక్కగా ద్వారముగల యొకగది కనంబడినది. దానికవాటము లించుక చేరవేయఁబడియున్నవి. లోపల మణిదీపములు వెలుగుచుండెను. అప్పు డత్యంత సాహసముతో నతండు తలుపులు త్రోయక మెల్లగా వివరములనుండి లోపలికిఁ దొంగిచూచెను.

దివ్యాలంకారశోభితంబగు నక్కందరమందిరాభ్యంతరమున రత్న పర్యంకమున నొక యక్షుండు యక్షిణి నక్కు నం జేర్చుకొని ముద్దాడుచుండెను.

యక్షిణి - మనోహరా ! మన వియోగకాలము సంవత్సరమే