పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/154

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దత్తకశాపవిముక్తి కథ.

145

ఆ బాహ్మణపుత్రుండా పత్రికనందుకొని వాకిటకువచ్చి రాజ పురుష వేష్ఠితుండగు దత్తకుంజూచి సంభ్రమాశ్చర్యములతో నాప్రాణమిత్రుఁడు దత్తకుఁడా? అయ్యో! శుద్ధాంతమునకేమిటికి పోయితివి? అని యడిగిన నతండు గోణికాపుత్రుఁడా ! ఔరా? యెంతచోద్యము అని పలుకుచు నతనిం గౌఁగలించికొని మిత్రుఁడా! వీండ్రు నన్నూరక నిర్బంధించినారు అపరాధమేమియుఁ జేయలేదు. దారి తెలియక లోపలికి గొంచెము దూరముబోయితిరిగి యప్పుడేవచ్చితిని. అని చెప్పినవిని గోణికాపుత్రుఁడు చాలు చాలు. ఈతఁడా? అపరాధి ఇతఁడు రాజపుత్రుని మిత్రుఁడు పో. పొండని యదలించిన రాజకింకరులు మారుమాట పలుకనేరక యవ్వలికి పోయిరి. పిమ్మట దత్తకుండు గోణికాఁపుత్రుని హస్తము గైకొని మిత్రమా ! నీవెప్పుడు వచ్చితివి? రాజావలంబన మెట్లుగలిగినది? మనమిత్రులలో నెవ్వరైన వచ్చియుండిరా? విశేషము లేమని యడిగిన నతండిట్లనియె.

నేను శుభముహూర్తంబునఁ గాశీపురంబు బయలువెడలి పూర్వ దక్షిణముగాఁ బోవుచు నొకయగ్రహారంబున గోమఠుండను బ్రహ్మచారికి వివాహముగావించి యటఁగదలి యనేక జనపదంబులు జూచుచు నీ జన్మభూమియగు పాటలీపుత్రనగరంబున కరిగితిని అందు రతినూపురయను వేశ్యయింటి కతిధిగా బోయితిని. దాని పెద్దకూఁతురు చిత్రసేన బాల్యంబున నీతోఁ జదివికొనినదఁట నిన్నేగాని పెండ్లియాడనని నియమము చేసికొనినది. రెండవదియగు రతిమంజిరి నన్ను వరించినది. వారిరువురు సర్వైశ్వర్యములువిడిచి నాతో బయలుదేరిరి. మార్గమధ్యంబున మతంగయోగిని బన్నినకపటంబునంబడి ప్రాణసంకటంబగు నిడుమలం గుడిచితిమి. దైవకృప నావెతల నతిక్రమించి యొకనాఁటి రేయికి నీ యూరుచేరితిమి. పురవిశేషములఁ దెలియని వారమగుట నాఁటి రేయినూరి బయిలనున్న సత్రములోఁ బండుకొంటిమి. ఆరాత్రి నాకు