పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/68

ఈ పుట ఆమోదించబడ్డది

హైమవతికథ

71

రూపము నిలువదు. కావున సునీతి కట్టివేళ నిజరూపము గనంబడినది. నానుడివినదంత నిక్కువము మీరు వచ్చినంత బీటలమీద నంతర్ధానమైపోయెను. దేవతాసంపర్కంబున స్త్రీలకు ప్రతభంగము కానేరదు. కావున సునీతి నిర్దోషురాలుగా స్వీకరింపవచ్చునని యాబుద్ధిమంతురాలు జరిగిన స్థితియంతయు, జూచి నట్లు చెప్పినది. అప్పుడందఱికి మేనులు గఱుపు జెందినవి అప్పుడు జయభద్రుడు మిక్కిలి సంతోషించుచు సునీతిని నిర్దోషురాలిగా నెంచి యాయించుబోడిని మన్నించి యక్కునం జేర్చి యుపలాలనము సేయుచుండెను.

అప్పుడా వార్త అంతయు గ్రామములో వ్యాపించుటచే నెల్లరు నద్బుతముగా జెప్పుకొన దొడంగిరి. మరియు గొందఱు మంచిగాను గొందరు చెడ్డగాను ఆవార్త జెప్పుకొనుట విని సునీతి మిక్కిలి పరితపించుచు అయ్యో! నేనెంత దోషకారినైతిని. పూర్వజన్మమునందేమి దుష్కార్యము జేసితినో! ఇంతకుమున్ను నన్నుత్తమరాలుగా జెప్పుకొనిన ప్రజలు ఆనోటనే దుష్టురాలిగా నుడువుచుండిరి. సీ! ఇట్టి నిందాపాత్రమైన జన్మము భరించుటకన్న నీచమున్నదియా? అవును తర్కింపగా శేషుడుమాత్రము పరపురుషుడు గాడా పరపురుషసంపర్కమున అపవిత్రమైన శరీరమును అగ్నిలో బడవైచి శుద్దిగావించెద ననుజ్ఞయిండు అని దుఃఖించుచు వల్లభుని పాదంబులంబడి వేడుకొనదొడంగినది.

జయభద్రు డాసాధ్వీమణి యుద్యమమును మానిపింప నెంతేని ప్రయత్నము జేసెను కాని యేమియు బ్రయోజనము లేకపోయెను.

అప్పడతి యొడయనింజూచి యార్యా! ఈవిషయమున మీరేమియు నడ్డు సెప్పవలదు. నేను త్రికరణములచేతను మీ పాదములనే నమ్మియుంటినేని అగ్ని నన్నేమియు జేరనేరదు. కళంకము గలిగెనేవి దగ్ధము గావించును. ప్రజల నిందావాక్యముల నేను భరింపలేను. పైడియొక్క గుణాగుణంబులు అగ్నివలననేకదా దెలియుచున్నవి. అట్లే మదీయబుద్ధినైర్మల్యము తన్ముఖమున దెలసికొనవచ్చును. చితి యేర్పరపింపుడు మీపాదములు నమ్మియున్న నన్ను గరుణింపుడని అనేక ప్రకారముల వేడికొనియెను.

అప్పుడు జయభద్రుడు ఆపట్టణపుకోట ముంగల మంచిగంధపుదారువులతో జితి బేరిపించి యావార్త పురమంతయు జాటంబంచెను. అప్పుడు పౌరులు గుంపులు గుంపులుగా గూడుకొని యాసునీతి నీతివిశేషమునకు మెచ్చుకొనుచు జూడవచ్చిరి. మఱియు సామంతులు మంత్రులు బంధువులు హితులు పురోహితులు మొదలగు వారందఱు చుట్టును బరివేష్టించి యావింత జూచుచుండిరి.

అప్పుడా చితిని బ్రజ్వరిల్లంజేసిరి. పిమ్మట సునీతి జలక మాడి గంధమాల్యానులేపనములు ధరించి బ్రాహ్మణులకు అనేకదానములు గావించి వారి యాశీర్వచనములందుచు వచ్చి సూర్యునికి నమస్కరించి యాచితిచుట్టు ముమ్మారు